2,3 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌?

– విద్యాశాఖ కసరత్తు
– 11 వేల ఉపాధ్యాయ పోస్టులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ వెలువడక ముందే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే రెండు, మూడు రోజుల్లో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశమున్నది. ఇందుకోసం విద్యాశాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి వారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తీసుకున్నట్టు తెలిసింది. వాటి భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆ వెంటనే విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశమున్నది. ‘అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం.’అని కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లాస్థాయి నియామక కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ను గతేడాది సెప్టెంబర్‌ ఆరో తేదీన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. 5,089 ఉపాధ్యాయ పోస్టులకు 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆయా పోస్టుల సంఖ్యను పెంచాలని భావిస్తున్నది. మరో ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులను అదనంగా కలపాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో 11 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశమున్నది. లోపాల్లేకుండా, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనలను పొందుపర్చాలని విద్యాశాఖ భావిస్తున్నది. అయితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డీఎస్సీ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

Spread the love