కేసీఆర్ తొందరపాటు వల్ల రూ.81వేల కోట్ల అప్పు..

నవతెలంగాణ-హైదరాబాద్ : భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ ప్లాంట్లు, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. బీఆర్కే భవన్‌లో కమిషన్‌ కార్యాలయానికి తెలంగాణ జ‌న స‌మితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, విద్యుత్‌శాఖ అధికారి రఘు వచ్చారు. ఇద్దరి వద్ద కమిషన్‌ వివరాలు అడిగి తెలుసుకుంది. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చట్టం ప్రకారం అందరం నడుచుకోవాలి. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలి. అభివృద్ధి అంటే ఒకరిద్దరికి లాభం చేయడం కాదు. గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల ట్రాన్స్‌కో, జెన్‌కోలకు రూ.81 వేల కోట్ల అప్పులయ్యాయి. భవిష్యత్‌లో గోదావరి వద్ద నీటి మట్టం పెరిగితే భద్రాద్రి ప్లాంట్‌ను కాపాడుకోగలమా?. గతేడాది వచ్చిన వరదలకు భద్రాద్రి ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తాయి. ఆ తప్పిదాలపై క్రిమినల్‌ చర్యలకూ వెనుకాడవద్దు’’ అని కోదండరాం కోరారు.

Spread the love