Thursday, May 21, 2026
E-PAPER
Homeజాతీయంఎబోలా వైరస్..ఎయిర్‌పోర్టులో అల‌ర్ట్

ఎబోలా వైరస్..ఎయిర్‌పోర్టులో అల‌ర్ట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో …. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తమైంది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వస్తున్న లేదా ఆయా దేశాల మీదుగా ప్రయాణిస్తున్న ప్రయాణికుల కోసం గురువారం ఒక హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది. వ్యాధి లక్షణాలు కనిపించినవారు వెంటనే విమానాశ్రయంలోని ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్‌) జారీ చేసిన ఈ మార్గదర్శకాలను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా పంచుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) నివేదికల ఆధారంగా డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌లను హై-రిస్క్ దేశాలుగా గుర్తించారు.

ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో జ్వరం, వాంతులు, తీవ్రమైన నీరసం, విరేచనాలు, తలనొప్పి, కండరాల నొప్పి, గొంతునొప్పి, వివరించలేని రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటే ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌కు ముందే ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆఫీసర్‌కు లేదా హెల్త్ డెస్క్‌కు తెలియజేయాలని సూచించారు. అలాగే, ఎబోలా సోకినట్లు అనుమానిస్తున్న లేదా నిర్ధారణ అయిన రోగి రక్తం లేదా శరీర ద్రవాలతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారు కూడా అధికారులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

భారత్‌కు వచ్చిన 21 రోజుల్లోగా ఈ లక్షణాలు కనిపిస్తే …. తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలని, తమ ప్రయాణ వివరాలను వైద్యులకు వెల్లడించాలని అడ్వైజరీలో పేర్కొన్నారు. కాగా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజాగా 513 అనుమానిత ఎబోలా కేసులు, 131 అనుమానిత మరణాలు నమోదయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో …. జోర్డాన్ ఇప్పటికే కాంగో, ఉగాండా ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆరోగ్య తనిఖీలకు అందరూ సహకరించాలని ఢిల్లీ విమానాశ్రయం విజ్ఞప్తి చేసింది.

600కు పెరిగిన బండిబుగ్యో స్ట్రెయిన్‌ కేసులు..
ఎబోలా ప్రస్తుత వ్యాప్తికి బండిబుగ్యో స్ట్రెయిన్‌ రకం ప్రధాన కారణం. ఈ వైరస్ రకాన్ని ఇప్పటివరకు 600 మందిలో గుర్తించారు. ఆ లక్షణాలతో 139 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. బండిబుగ్యో స్ట్రెయిన్‌ కట్టడికి ఆమోదించిన టీకాలు ఏవీ అందుబాటులో లేవు. కొన్ని నెలల్లో మానవులపై ప్రయోగాలు జరగొచ్చని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -