Friday, May 29, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఈడి-మోడీ మిలాఖత్‌!

ఈడి-మోడీ మిలాఖత్‌!

- Advertisement -

“రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా” అన్నట్లు, బీజేపీ అనుకోవాలేగానీ ఏదైనా చేస్తుందన్నది పాతపడిన విద్యే. ఎన్‌ఐఏ, ఈడి, ఐటి, సిబిఐ వంటి సంస్థలను ఎగదోసి వ్యతిరేకించే ప్రతిపక్ష నేతల నివాసాలపై దాడులు చేయిస్తుంది. అరెస్టులు చేసి జైల్లో పెడుతుంది. మీడియా, సంస్థల్ని కూడా ఇదే తీరుగా బెదిరింపులకు గురిచేస్తుంది. కేరళం తాజా మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) అగ్రనేత పినరయి విజయన్‌ ఇంటితోపాటు కుటుంబ సభ్యుల నివాసాలపై బుధ వారం నాడు పన్నెండు చోట్ల ఈడి సోదాలు చేసింది. అదేమి పట్టుకుందో, ఏం వెలికితీసిందో తెలియదు. కానీ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ కూటమి విజయన్ ప్రభుత్వంపై చేయని ఆరోపణ లేదు. ఎంతగా దిగజారిందంటే ‘ఆయన్ను ఎందుకు అరెస్టు చేయటం లేదు?’ స్వయంగా రాహుల్‌గాంధీ ప్రశ్నించటాన్ని కేరళం పౌరులు చూశారు. బీజేపీతో సీపీఐ(ఎం) కుమ్మక్కు అయినందునే ఆ పని చేయలేదని దుష్ప్రచారం చేశారు.

ఒక కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టిన విజయన్ పోరాట వీరుడు, మచ్చలేని నేత. కన్నూరు జిల్లాలో శ్రామికుల తరఫున కమ్యూనిస్టులు నిర్వహించిన మహత్తర పాత్ర యావత్ ప్రపంచానికి తెలుసు. యువకుడిగా కష్టజీవుల కోసం నిలిచిన నాటి నుంచి విజయన్‌పై జరగని దాడి లేదు.అనేక సార్లు ప్రాణాలు తీసేం దుకు చూసిన శక్తులు ఇప్పుడు పరువు తీసేందుకు ఈ దాడి చేయించాయని వేరే చెప్పనవసరం లేదు. కన్నూరు ప్రాంతంలో ఒక వైపు కాంగ్రెస్, మరోవైపు ఆరెస్సెస్ మూకలు నిత్యం కమ్యూనిస్టులను అణచివేసేందుకు చేసిన యత్నాలను స్వయంగా ఎదుర్కొన్ననేత విజయన్, బీజేపీతో చేతులు కలుపుతారా? సూర్యుడి మీద ఉమ్మివేస్తే వేసినవారి మీదే పడుతుంది. గతంలో మంత్రిగా చేసినపుడు విజయన్ మీద కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు ఒక్కటీ రుజువు కాలేదు. పోరుబాటలో మడమ తిప్పకుండా ముందుకు పోతున్న విజయన్‌కు కేసులు కొత్తకాదు, ఈ దాడులతో ఆయన ప్రతిష్ట మసకబారేదీ లేదు. జర్మన్ గోబెల్స్ మాదిరి కాంగ్రెస్ నేతల దిగజారుడు ప్రచారం, బీజేపీ ఆచరణ వెనుక పెద్ద కుట్రేదాగి ఉందని ఇప్పుడు ఈ సోదాలు తేటతెల్లం చేశాయి. నిజంగా బీజేపీతో చేతులు కలిపి ఉంటే ఈడి దాడులు జరిగేవా? బుర్రలో గుజ్జున్న ప్రతి ఒక్కరూ నేడు ఆలోచిస్తున్నారు.

దేశంలో, వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అవకాశవాద, దిగజారుడు రాజకీయాల గురించి చెప్పనవసరం లేద. మద్యం కుంభకోణం పేరుతో తప్పుడు కేసు పెట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్, మంత్రులను నెలల తరబడి జైల్లో పెట్టినపుడు బీజేపీ ఆరోపణలకు కాంగ్రెస్ వంతపాడింది. అలాంటి పార్టీ కేరళంలో తమకు రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న సీపీఐ(ఎం) నేతలపై తప్పుడు ఆరోపణలు చేయటంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి పార్టీ ఇండియా కూటమిలో పెద్ద పక్షంగా ఉండి బీజేపీకి పరోక్షంగా సాయం చేయటం తప్ప ఆ కూటమిని ముందుకు తీసుకుపోతుందా! విజయన్‌పై దాడిని ఎంకె స్టాలిన్, కేజ్రివాల్, తేజస్వీ యాదవ్, డి.రాజా వంటి ఎందరో ఖండించారు. ఈడి మీద దాడికి పాల్పడ్డారనే పేరుతో మూడు వందల మంది సీపీఐ(ఎం) కార్యకర్తలు, అభిమానుల మీద కేరళం కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టి అనేక మందిని అరెస్టులు చేసింది. అయినప్పటికీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. ఈడి దాడులతో కేరళం నివ్వెరపోయింది. అసలు ఆ సంస్థ ముందుగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని రాష్ట్ర డిజిపి చెప్పటం రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడే నాటకం తప్ప మరొకటి కాదు. అదే గనుక నిజమైతే కాంగ్రెస్ నేతలు కేంద్ర సంస్థ చర్యను ఎందుకు తప్పుపట్టలేదు. ఇంతకూ విజయన్‌పై దాడి ఎందుకు చేసినట్లో తెలుసా! కేవలం కోటీ 72లక్షల రూపాయల మేరకు అవినీతి జరిగిందనే పేరుతో చేసిన దాడులు. విజయన్ కుమార్తె వీణ అనేకమంది మాదిరే బెంగళూరులో ఎక్సా లాజిక్ కన్సల్టెన్సీ అనే ఒక చిన్న కంపెనీ పెట్టుకున్నారు.

2017 నుంచి 2020 వరకు ఆ కంపెనీ ఒక ప్రభుత్వ సంస్థకు సాఫ్ట్‌వేర్ సేవలను అందించి నందుకు ఈ నగదు పొందిందన్నది ఆరోపణ. ఇప్పుడా కంపెనీ అసలు ఎలాంటి కార్య కలాపాలు నిర్వహించటం లేదు. అవినీతి డబ్బు చేతులు మారిందని గతంలో కాంగ్రెస్ ఆరోపించింది, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒకరు ఈడికి ఫిర్యాదు చేశారు. కంపెనీని మూసివేసిన ఆరేండ్ల తరువాత ఈడి దాడులు చేసింది. దీనర్ధం ఇప్పుడు చేయవద్దని కాదు, జనం సొమ్ము ఎంతైనా సరే విచారణ జరపాల్సిందే. లావాదేవీలన్ని చట్టబద్దంగానే జరిగాయి గనుక వాటిని దాచేందుకేమీ ఉండదు. ఎందరో ఘరానా పెద్దలు, కార్పొరేట్ల అధిపతులు, వందలు, వేల కోట్ల రూపాయల కుంభ కోణాలకు పాల్పడి ఎలా తప్పించుకుంటున్నారో తెలిసిందే. అలాంటి వారు బీజేపీలో చేరినా, ఆ పార్టీకి ఎన్నికల బాండ్లో, మరోపేరుతోనో వందల కోట్లు నిధులు ఇచ్చినా ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ తంతు తెలిసిందే. రెండోసారి అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్‌నేతగా ఉండగా బీజేపీ పెట్టిన చార్జిషీటు గురించి, ఇప్పుడు బెంగాల్ బీజేపీ సీఎంగా పీఠమెక్కిన సువేందు అధికారి గురించి స్వయంగా మోడీ చేసిన అవినీతి ఆరోపణల గురించి ఏ కేంద్ర దర్యాప్తు సంస్థా ఎలాంటి దాడులు చేయలేదు.అందుకే ఏనుగులు దూరే కంతలను వదలి దోమలు దూరేవాటి దగ్గర కూర్చున్నట్లుగా ఈడి తీరు ఉంది!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -