నవతెలంగాణ-హైదరాబాద్: సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలను భారత కమ్యూనిస్టు (మార్క్సిస్ట్) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు గురువారం పత్రిక ప్రకటన విడుదల చేసింది. రాజకీయ ప్రత్యర్థులను వేటాడేందుకు కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించే బీజేపీ ప్రభుత్వ ఫాసిస్టు పద్ధతిలోకి..కేరళంలోని యూడీఎఫ్ ప్రభుత్వం కూడా చేరుతోందని సీపీఐ(ఎం) మండిపడింది.ఈ చర్యలు రాజకీయ కక్షసాధింపులో భాగమని బీజేపీ, కాంగ్రెస్ మధ్య “అపవిత్ర కూటమి”కి నిదర్శనమని పేర్కొంది.
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రణాళికాబద్ధమైన చర్యకు పాల్పడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ సన్నాహాలతో ఈడీ అధికారులు బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో రహస్యంగా సోదాలు ప్రారంభించారు. తిరువనంతపురంలోని పినరయి విజయన్ అద్దె నివాసం, కన్నూర్‌లోని ఆయన కుటుంబ నివాసంలో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. వివాదాస్పద ఎక్సాలాజిక్-సీఎంఆర్ఎల్ ఉదంతం ముసుగులో ఈడీ సుదీర్ఘ విరామం తర్వాత ఈ దాడులను పునఃప్రారంభించింది.
ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్‌లు సంయుక్తంగా తీసుకున్న రాజకీయ నిర్ణయమే ఈ ఈడీ చర్యకు కారణమని బలమైన సూచనలు ఉన్నాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ ఎక్స్ ద్వారా తెలిపారు. ఇలాంటి చర్యలు పినరాయి విజయన్‌ను గానీ, సిపిఎంను గానీ భయపెట్టలేవని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని, దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుకుని ప్రతిపక్ష నాయకుడిని హత్య చేయడానికి, వేటాడటానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ప్రజలు దృఢంగా విశ్వసిస్తున్నారని తెలిపారు. ప్రజలను సమీకరించి ఈ రాజకీయ నాటకాలను ఎదుర్కొంటామని ఆయన ప్రకటించారు.



