Thursday, June 18, 2026
E-PAPER
Homeరిపోర్టర్స్ డైరీసాగుపై 'ఎల్‌నినో' నీడ

సాగుపై ‘ఎల్‌నినో’ నీడ

- Advertisement -

ప్రధాన ప్రాజెక్టుల్లో తగ్గుతున్న నీటి లభ్యత
శ్రీపాద ఎల్లంపల్లి, మధ్య-లోయర్‌ మానేరు ప్రాజెక్టుల్లో డెడ్‌ స్టోరేజీ
జూన్‌ రెండో వారంలోనూ భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
వర్షాభావ ముప్పుతో ఆందోళనలో అన్నదాతలు
వ్యవసాయ శాఖ వానాకాలం అంచనాలు బ్రేక్‌..
ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారుల దృష్టి

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
వానాకాలం సీజన్‌‌కు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురుకానున్నాయి. జూన్‌ 17వ తేదీ వచ్చినా రాష్ట్రంలో ఆశించినా వానలు పడటం లేదు. ఈనెల మొదట్లో కొద్దిగా వాతావరణం చల్లబడినా మళ్లీ
ఉష్ణోగ్రతలు భారీగానే నమోదవు తున్నాయి. తీవ్రమైన ఎండలతో ఈ వానాకాలం సీజన్‌పై ‘ఎల్‌నినో’ ప్రభావం ఉండనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అటు రైతాంగాన్ని, ఇటు అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. వానాకాల సాగుకు భారీగానే వ్యవసాయశాఖ భారీగానే అంచనాలు వేసింది. అయితే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో ఎలా ఉంటుందోనన్న హెచ్చరికలతో ముందుగానే ప్రత్యామ్నా యాలపై అధికారులు దృష్టి సారించారు. భూగర్భ జలాలు భాగుంటున్నా ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జున సాగర్‌, కాళేశ్వరం, శ్రీశైలం, జూరాల తదితర ప్రాజెక్టుల్లోకి నీటి లభ్యత ఉండటం లేదు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ప్రధాన జలాశయాలు అడుగంటి డెడ్‌ స్టోరేజీకి చేరుకోవడం భవిష్యత్‌ సాగు, తాగునీటి సంక్షేమానికి అద్దం పడుతోంది.

​చుక్క నీరు లేని ఇన్‌ఫ్లోలు
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు గుండెకాయ లాంటి ప్రధాన జలాశయాలు ప్రస్తుతం జీవకళ కోల్పోయాయి. ఎగువ నుంచి ఇన్‌ఫ్లోలు పూర్తిగా నిలిచిపోవడం, ఎండల తీవ్రతకు నీరు ఆవిరి కావడం, తాగునీటి అవసరాలకు తరలించడంతో ప్రాజెక్టులు డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నాయి. ప్రధానంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.136 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. జూన్‌ 10 నాటికి ఇన్‌ఫ్లో పూర్తిగా ‘నిల్‌’ కాగా, హైదరాబాద్‌ తాగునీటి సరఫరా (హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌) కోసం 275క్యూసెక్కులు, ఎన్‌టీపీసీ అవసరాల కోసం 121 క్యూసెక్కులు కలుపుకుని 396 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. 27.55 టీఎంసీల నీటి నిల్వ గరిష్ట సామర్థ్యం కలిగిన మిడ్‌‌మానేరు ప్రాజెక్టులో ప్రస్తుతం 7.491 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది. ఇన్‌ఫ్లోలు శూన్యం కాగా, ఎండల తీవ్రతకు రోజుకు 36 క్యూసెక్కుల నీరు ఆవిరైపోతోంది. కరీం’నగరాన్ని’ ఆనుకుని ఉన్న 24.034 టీఎంసీల సామర్థ్యంగల ఎల్‌ఎమ్‌‌డీలో ప్రస్తుతం 6.172టీఎసీల నీరు మాత్రమే ఉండటం ఆందోళనకరంగా ఉంది. ఈ డ్యామ్‌‌కూ ఇన్‌ఫ్లోలు ఏమీ లేకపోగా ఇతర అవసరాలకు రోజుకు 232 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదవుతోంది.

ఎల్‌నినో ముప్పు..
​వాతావరణ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ హెచ్చరిస్తున్నట్టుగా ‘ఎల్‌నినో’ ప్రభావం ఈ వానాకాలం సీజన్‌ను తీవ్రంగా దెబ్బతీసేలా కనిపిస్తోంది. వర్షాలు పడకపోతే నారుమళ్లు పోయడం, విత్తనాలు చల్లడం ఆలస్యమై, పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టుల్లో నీటి కొరత భయపెడుతున్నా.. ఉమ్మడి కరీంనగర్‌ పరిధిలోని రైతులు మాత్రం ఈ వానాకాలంలోనూ వరి సాగుకే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

ఆరుతడి పంటలపైనే దృష్టిసారించాలి
భూగర్భ జలాలు, ప్రాజెక్టు నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున.. రుతుపవనాలు పూర్తిగా విస్తరించి, తగినంత వర్షపాతం నమోదైన తర్వాతే రైతులు నారుమళ్లు పోసుకోవడం ఉత్తమం. సాధ్యమైనంత వరకు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలి. ప్రకృతి కరుణించి త్వరలోనే ముసురు పడితేనే అన్నదాత గట్టెక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలూ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
​-బి.శ్రీనివాస్‌, పెద్దపల్లి జిల్లా వ్యవసాయాధికారి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -