ఎర్రటి ఎండలో రోడ్డుపై బైటాయించి ఆందోళన చేసిన 150 మంది భూనిర్వాసితులు
భారీగా మోహరించిన పోలీసు బలగాలు ఉద్రిక్తంగా మారిన ఆందోళన
నవతెలంగాణ-గార్ల
పంటలు పండే సాగు భూములను నాశనం చేసి మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టవద్దని భూ నిర్వాసిత రైతులు, మున్నేరు జలసాధన కమిటీ నాయకులు కందునూరి శ్రీనివాస్, శీలంశెట్టి రమేష్ అన్నారు. మున్నేరు పాలేరు లింక్ కెనాల్ నిర్మాణంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా గారల మండలం కంసాలి తండా సమీపంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు బుధవారం సర్వే చేసేందుకు సాగు భూముల్లోకి రాగా కంసాలి తండా, బుద్ధారం, మర్రిగూడెం సమీప ప్రాంతాలకు చెందిన భూనిర్వాసిత రైతులు సర్వేను అడ్డుకున్నారు. సర్వేను చేపట్టవద్దని ఎర్రటి ఎండలో రోడ్డుపై బైటాయించి సుమారు నాలుగు గంటలకు పైగా ఆందోళన చేశారు. ‘అధికారులు గో బ్యాక్’ అంటూ బాధితులు నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తహసీల్దార్ శారద, గార్ల-బయ్యారం సీఐ రవీందర్, ఎస్‌ఐ బి. సాయికుమార్, డోర్నకల్ సీఐ చంద్రమోహన్ ఆందోళనకారులతో మాట్లాడినప్పటికీ పూర్తిగా సర్వేను నిలిపివేసి, కెనాల్ నిర్మాణం జీవోను రద్దు చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని బిష్మించుకు కూర్చున్నారు. ఆందోళన వద్దకు చేరుకున్న మహబూబాబాద్ ఆర్డీఓ ఎల్. అలివేలు ఆందోళనకారులతో మాట్లాడుతూ.. భూనిర్వాసిత రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఆందోళన విరమించాలని కోరారు.
స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళ నకారులు చెప్పడంతో రైతులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి సర్వేను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ ఆందోళనకు సీపీఐ(ఎం) నాయకులు మద్దతు తెలిపి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ఉన్న కొద్దిపాటి భూముల్లో పంటలు పండించుకొని జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు లింక్ కెనాల్ నిర్మాణం పేరుతో ఉన్న భూములను గుంజుకుంటే జీవనం సాగించలేమని ఆందోళన వ్యక్తం చేశారు. మండలానికి చుక్కనీరు అందించని ఈ లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టవద్దని అనేక రకాలుగా రైతులు, రైతు సంఘాలు, అఖిలపక్ష నాయకులు, పార్టీలకు అతీతంగా అనేక రూపాల్లో ఆందోళనలు, అధికారులకు వినతి పత్రాలు అందించి నిరసనలు చేసినప్పటికీ ప్రభుత్వం కానీ, ప్రజా ప్రతినిధులు కానీ, సంబంధిత అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లింక్ కెనాల్ నిర్మాణంలో కంసలి తండా గ్రామం పూర్తిగా లేకుండా పోతుందని, తామంతా ఎక్కడికి వెళ్లి బతకాలని సంబంధిత అధికారులను నిలదీశారు. ఈ ఆందోళనలో భూ నిర్వాసిత రైతులు, కంసాలి తండ ఇండ్లు కోల్పోతున్న బాధితులు, సీపీఐ(ఎం) నాయకులు వి. వెంకటేశ్వర్లు, ఐ. గోవిందు, ఎం. నాగమణి, సీహెచ్ ఎల్లయ్య, సీహెచ్ మౌనిక, రామకృష్ణ, తదితరులు ఉన్నారు.
ఎండకు అస్వస్థతకు గురైన పోలీస్ సిబ్బంది
సర్వేను నిలిపి వేయాలని ఆందోళన చేస్తున్న ఆందోళనకారుల వద్దకు బందోబస్తుగా హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన పి. సాంబయ్య అనే పోలీస్ సిబ్బంది తీవ్రమైన ఎండలకు స్పృహ తప్పి పడిపోగా ఎస్‌ఐ బి. సాయికుమార్ హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాంబయ్యను అఖిలపక్షం నాయకులు పరామర్శించారు.



