ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి

ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి– ఎటువంటి అనుమానాలకు తావివ్వొద్దు
– స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి: వంద శాతం వీవీ ప్యాట్‌ స్లిప్‌ల మ్యాచింగ్‌పై తీర్పు రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా సాగాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేసింది. స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరగడానికి తీసుకున్న చర్యలను సూచించింది. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అనుమానాలకు తావివొద్దని సుప్రీంకోర్టు సూచించింది. వందశాతం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం), వీవీ ప్యాట్‌ పేపర్‌ స్లిప్స్‌తో క్రాస్‌ వెరిఫికేషన్‌ చేయాలని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తలతో కూడిన ధర్మాసనం విచారణ ముగించి, తీర్పు రిజర్వ్‌ చేసింది. ఏడీిఆర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఇటీవల కేరళలో జరిగిన మాక్‌ పోల్‌ గురించి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ”కాసరగడ్‌లో మాక్‌ ఓటింగ్‌ జరిగింది. అక్కడ నాలుగు ఈవీఎంలను వీవీప్యాట్లతో సరిపోలిస్తే బీజేపీకి అదనంగా ఓట్లు వచ్చాయి” అని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీనిపై ఎన్నికల సంఘం తరపున సీనియర్‌ న్యాయవాది మణిందర్‌ సింగ్‌ స్పందిస్తూ కేరళలోని కాసరగడ్‌లో మాక్‌ పోలింగ్‌లో బీజేపీకి ఎక్కువ ఓట్లు పోలైనట్లు వచ్చిన నివేదికలు తప్పు అని, జిల్లా కలెక్టర్‌ నుంచి ఆ వార్తలపై వివరణ తీసుకున్నామని, అవన్నీ తప్పుడు వార్తలని పేర్కొన్నారు. దీనిపై పూర్తి రిపోర్టును కోర్టులో సమర్పించనున్నట్లు సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీశ్‌ కుమార్‌ తెలిపారు. ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడం అసాధ్యమని అన్నారు. నాలుగు కోట్ల వీవీప్యాట్‌ స్లిప్‌లు లెక్కించామని, ఎక్కడా మ్యాచ్‌ కాకపోవడం జరగలేదని అన్నారు.

Spread the love