టేకాఫ్ అయిన 3 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

నవతెలంగాణ పాట్నా: పాట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం ఇండిగో 6ఈ 2433 విమానం ఢిల్లీకి బయల్దేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఒక ఇంజిన్ పనిచేయడం లేదని పైలట్ గుర్తించి ఈ సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఉదయం 9.11 గంటలకు విమానాన్ని పాట్నా విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ‘పాట్నా విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరి ఇండిగో ఫ్లైట్ 6ఈ 2433 విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ఇంజిన్ పనిచేయలేదని గుర్తించాం. దీంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. 9.11 గంటలకు అదే ఎయిర్ పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రస్తుతం విమానాశ్రయంలో అన్ని కార్యకలాపాలు సాధారణంగానే సాగుతున్నాయి’ అని విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. మరోవైపు ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపేందుకు ఏర్పాట్టు చేస్తున్నట్లు చెప్పారు.

Spread the love