భారీ వర్షాలు…28 వరకు స్కూళ్లకు సెలవులు

నవతెలంగాణ-ఢిల్లీ
న్యూఢిల్లీతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. దీంతో ఇన్నిరోజులుగా రికార్డు స్థాయి ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఉపశమనం లభించింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నది. ఢిల్లీతోపాటు నోయిడా, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌లో భారీ వర్షపాతం నమోదయింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వచ్చే 2 గంటల్లో ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌లోని ఫరూఖ్‌ నగర్‌, కోసాలి, మహేందర్‌గఢ్‌, సొహానా, రెవారి, నార్నౌల్‌, బావల్‌, భివారి, తిజారా, ఖైర్తాల్‌, కోట్‌పుట్లీ, ఆల్వార్‌, విరాట్‌నగర్‌, లక్ష్మాగఢ్‌, రాజ్‌గఢ్‌, నబ్దాయ్‌, భరత్‌పూర్‌, మహావా, బయానా ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే బీహార్‌లో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పాట్నాలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీనికి వేడి గాలులు తోడవడంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు ఈ నెల 28 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. 12వ తరగతి వరకు ఎలాంటి తరగతులు నిర్వహించడానికి వీళ్లేదని జిల్లా మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఈ నెల 24 వరకు సెలవులు ప్రకటించారు. అయినప్పటికీ ఎండ వేడి తగ్గకపోవడంతో వాటిని మరో నాలుగు రోజులపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Spread the love