నవతెలంగాణ – ఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళన రోజురోజుకీ ఉద్ధృతంగా మారుతోంది. ఈ క్రమంలోనే రెజ్లర్ల నిరసన గురించి కేంద్రమంత్రి మీనాక్షి లేఖిని మీడియా ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా ఆమె పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవడంతో కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అసలేం జరిగిందంటే..కేంద్రంలో భాజపా 9ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి వచ్చిన కేంద్రమంత్రి మీనాక్షి లేఖిని విలేకరులు చుట్టుముట్టారు. ‘‘రెజ్లర్ల ఆందోళనపై మీ స్పందన ఏంటి?’’ అని ఆమెను ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మీనాక్షి లేఖి వెళ్తుండగా.. విలేకరులు కూడా ఆమెను అనుసరించారు. అదే ప్రశ్నను మళ్లీ అడగ్గా.. ‘‘న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది’’ అని చెబుతూ ఆమె పరిగెత్తారు. కేంద్రమంత్రి ‘చలో.. చలో.. చలో’ అంటూ తన కారు వద్దకు పరిగెట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ మీడియా ఛానల్‌లో ప్రసారమైన ఈ వైరల్ వీడియోను కాంగ్రెస్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. విమర్శలు చేసింది. ‘‘మహిళా రెజ్లర్ల ఆందోళన అంశంపై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఎంత సూటిగా బదులిచ్చారో మీరే చూడండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది.