బండి వద్ద రూ.100 కోట్లు ఎక్కడివి..?

– పుస్తేలమ్మి ఎలక్షన్లలో ఎంపీగా నిలబడ్డారు..
– అలాంటిది కోట్లల్లో ప్రకటనలిచ్చే స్థాయి ఎక్కడిది..! : రఘునందన్‌రావు బ్లాస్ట్‌
– చుగ్‌, బన్సల్‌ బొమ్మలు చూసి ప్రజలు ఓట్లేయలేదు
– మునుగోడు ఎన్నికలో రూ.100 కోట్ల ఖర్చు
– పదేండ్లలో నాకంటే ఎక్కువ ఎవ్వరూ కష్టపడలేదు
– నా కులమే నా ఎదుగుదలకు శాపమా? : మీడియాతో చిట్‌చాట్‌లో రఘునందర్‌రావు
– టీ తాగుతూ మాట్లాడిన అంశాలను వక్రీకరించారని ప్రెస్‌మీట్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ బ్యూరో
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు బ్లాస్ట్‌ అయిపోయారు. బీజేపీలో కొంతకాలంగా జరుగుతున్న ఆధిపత్య పోరు వాస్తవమేనని తన మాటల ద్వారానే తేల్చేశారు. బండి సంజరు స్వయంకృతాపరాధమే దానికి కారణమని స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన ఓపెన్‌ అయిపోయారు. బండిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ గత ఎన్నికల్లో పుస్తెలమ్మి పోటీ చేశారనీ, అలాంటిది ఇప్పుడు రూ.వందల కోట్లు యాడ్లు ఇచ్చేంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. ఒక వేళ అది పార్టీ డబ్బు అనుకుంటే అందులో అందరికీ వాటా ఉంటుందన్నారు. పదేండ్ల నుంచి కష్టపడుతున్నా పార్టీ అధ్యక్ష పదవికి అర్హుడిని కాదా? అని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్‌ లీడర్‌లో ఏదో ఒకటి ఇవ్వాలనీ, చివరకు జాతీయ అధికార ప్రతినిధి పదవి అయినా ఇవ్వాలని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాకలో తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్‌, సంతోష్‌ బొమ్మలతో ఓట్లు రాలేదని చెప్పారు. తన కంటే ముందు పోటీచేసిన వారికి అక్కడ 3,500 ఓట్లే వచ్చాయని గుర్తుచేశారు. కేసీఆర్‌ను ఢకొీట్టే మొనగాడిని తానేనని జనాలు నమ్మారు కాబట్టే ఓటేశారనీ, అంతేకానీ బీజేపీని చూసి కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఎన్నికల్లో తనకెవరూ సాయం చేయలేదన్నారు. ఎన్నికల్లో పార్టీ గుర్తు చివరి అంశమే అని స్పష్టం చేశారు. రఘునందన్‌, ఈటల రాజేందర్‌ బొమ్మలతోనే ఓట్లు వస్తాయన్నారు. దుబ్బాక నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మునుగోడులో బీజేపీ గెలువలేదనీ, అవే డబ్బులు నాకిస్తే తెలంగాణను దున్నేసేవాడిని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఫ్లోర్‌ లీడర్‌ పదవి కావాలని ఓ కార్పొరేటర్‌ అడిగి అడిగి చనిపోయాడని గుర్తుచేశారు. అసెంబ్లీలో బీజేపీఎల్పీ నేత లేడనే విషయం పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు తెలియదన్నారు. ఆ విషయమై ప్రశ్నిస్తే అదేంటి అంటూ తననే నడ్డా తిరిగి అడిగారన్నారు. తాను గెలిచినందుకే ఈటల సైతం బీజేపీలోకి వచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన మీడియాకు వెల్లడించారు. బండి సంజయ్ మార్పుపై మీడియాలో వస్తున్న కథనాలన్నీ నిజాలే అని చెప్పుకొచ్చారు.
టీ తాగుతూ సరదాగా మాట్లాడాను…వక్రీకరించారు.. :మీడియా సమావేశంలో రఘునందన్‌రావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుపై తాను వ్యాఖ్యలు చేసినట్టు, అధిష్టానాన్ని ధిక్కరించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదనీ, తాను కేవలం టీ తాగుతూ మీడియా మిత్రులతో సరదాగా మాట్లాడానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు అన్నారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను రాష్ట్ర, కేంద్ర నాయకత్వాన్ని ఎక్కడా ధిక్కరించలేదని స్పష్టంచేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించడానికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటికి వెళ్లానని చెప్పారు. రెండు నెలలుగా నియోజకవర్గానికే పరిమితం అయ్యానన్నారు. తాను, కమలం గుర్తు వేర్వేరు కాదని స్పష్టంచేశారు. తన మాటలను కొన్ని మీడియా ఛానళ్లు వక్రీకరించాయని చెప్పారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పదేండ్లుగా బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నానన్నారు. సొంత లాభం కోసం ఎప్పుడూ పని చేయలేదని చెప్పారు.

Spread the love

One thought on “బండి వద్ద రూ.100 కోట్లు ఎక్కడివి..?

Comments are closed.