ఈటల వర్సెస్‌ బండి

– బీజేపీలో రగులుతున్న అంతర్గత పోరు
– అణగదొక్కితే అణిగిపోయే వ్యక్తిని కాదంటూ బండి వ్యాఖ్య
– ఈటల, బండి బహిరంగవ్యాఖ్యలతో వివాదాలకు మరింత ఆజ్యం
– కాంగ్రెస్‌వైపు కొత్తోళ్ల చూపు
బీజేపీలో అంతర్గత పోరు రోజురోజుకీ ముదిరిపాకానపడుతున్నది. కొండా..ఈటెల…బండి…ఇలా నేతల బహిరంగ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తున్నట్టు కనిపిస్తున్నది. పాతోళ్ల పోరుతో కొత్తోళ్లంతా గ్రూపు గట్టి హస్తంపార్టీ వైపు చూస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతున్నది. నష్టనివారణ కోసం త్రిమూర్తులు (ప్రధాని మోడీ..అమిత్‌షా, జేపీ నడ్డా) రంగంలోకి దిగినా, ఎన్ని ఎత్తులేసినా…బలవంతపు కాపురం ఎక్కువరోజులు సాగదన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఎన్నికల నాటికి పార్టీలో ఎవరుంటారో? ఎవరు పోతారో? అర్థంకాని ధైన్యస్థితి నెలకొంది.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌కుమార్‌లది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లానే. ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరే సమయంలోనే తన అనుచరుల కోసం తాను అడిగిన అసెంబ్లీ నియోజకవర్గాల సీట్లను ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి అధిష్టానం నుంచి హామీ పొందారు. ఆ తర్వాతే పార్టీలో చేరారు. రాష్ట్ర పార్టీని ఏమాత్రం పట్టించుకోకుండా ఏ సమస్య వచ్చినా నేరుగా జాతీయ నాయకత్వంతోనే చర్చిస్తున్నారు. ఇదే అంశంలో బండి సంజయ్‌ మొదటి నుంచీ ఈటలను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కిషన్‌ రెడ్డి కేంద్ర మంత్రి అయిన తర్వాత ఢిల్లీకే పరిమితం కావడం, లక్ష్మణ్‌ను ఎంపీగా చేసి రాష్ట్రంలో కీలక బాధ్యతల నుంచి బీజేపీ తప్పించిన తర్వాత అంతా బండి హవానే కొనసాగింది. చివరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చిన్న ప్రెస్‌మీట్‌ పెట్టాలన్నా అనుమతి తీసుకోవాల్సిందే. ఈటల వచ్చిన తర్వాత పరిస్థితుల్లో క్రమంగా మార్పు మొదలైంది. బండి గ్రూపునకు ఇది అస్సలు నచ్చడం లేదు. పైగా, ఈసారి కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాకుండా వేముల వాడ నుంచి బరిలో దిగాలని బండి చూస్తుంటే ఆదిలోనే ఈటల దానికి బ్రేకులు వేశారు. కేంద్ర అధిష్టానం వద్ద పట్టుబట్టి మరీ తన ముఖ్య అనుచరురాలైన తుల ఉమకు ఇచ్చేలా హామీ పొందినట్టు సమాచారం. బండికి ఇది ఏమాత్రం గిట్టట్లేదు. పైగా వేములవాడ నియోజకవర్గంపై పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో బీజేపీలో చేరికల కమిటీ చైర్మెన్‌గా ఉన్న ఈటల ఇమేజ్‌ను తగ్గించేందుకు బండి గ్రూపు ఎత్తులు వేస్తూనే ఉంది. అధిష్టానం వద్ద కూడా ఈటల ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసేలా చక్రం తిప్పుతున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల వరకు పార్టీ అధ్యక్షుని మార్పు ఉండబోదని అధిష్టానం స్పష్టంగా సంకేతాలు పంపింది. ఈ పరిణామాలు కొనసాగుతుండగానే ఇటీవల ఈటలతో పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఒకడుగు ముందుకేసి…’రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఇప్పుడున్న స్పీడ్‌ సరిపోదు’ అంటూ అధ్యక్షున్ని మార్చాలనే అర్థం వచ్చేలా మాట్లాడారు. వెంటనే తేరుకున్న బండి…’ఎంతటి నాయకులైనా సరే పార్టీ కట్టుబాట్లు, క్రమశిక్షణ తప్పితే వేటేస్తాం’ అంటూ కొండాకు కౌంటర్‌గా పరోక్షంగా హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం చల్లారకముందే..’పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరడం కష్టం. వారే నాకు రివర్స్‌ కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. కమ్యూనిస్టు భావజాలమున్న ఖమ్మం గడ్డ మీద విస్తరణ కష్టం’ అంటూ ఈటల బాంబు పేల్చేశారు. ఆయన కావాలనే ఇలా మాట్లాడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరినవారంతా ఈటల గ్రూపులో చేరుతున్నారు. ఈటల, కొండా, రాజగోపాల్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, విజయశాంతి, వివేక్‌ వెంకటస్వామితో సహా పలువురు బండి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీరికి మరికొంత మంది తోడైనట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే చాలా మందినేతలలో హస్తం పార్టీ అగ్రనేతలు సంప్రదింపులు జరుపున్నట్టు తెలిసింది. తెలంగాణ గడ్డ మీద బీజేపీకి స్కోప్‌ ఉండదనీ, తమతో పాటు కాంగ్రెస్‌లోకి రావాలని ఈటల, డీకే అరుణపై వారు ఒత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈటల గ్రూపు పోరును ఎదుర్కొనేందుకు బండి కూడా ఢీ అంటే ఢీ అంటున్నాడు. అందులో భాగంగానే ఇటీవల ఓ సమావేశంలో ‘నేను బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగివచ్చిన వ్యక్తిని. ఎవరో అణగదొక్కితే ఆగిపోయే వ్యక్తిని ఏమాత్రం కాదు’ అంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్య ఈటల గ్రూపును ఉద్దేశించి చేసినదేనన్న ప్రచారం జరుగుతున్నది. అదే సమయంలో బండి యాక్టివ్‌ రోల్‌ పోషిస్తుండగా.. బండి గ్రూపు సైలెంట్‌గా ఉంది. ఇది ఎక్కడకు దారితీస్తుందో చూడాలి. తారాస్థాయికి చేరిన ఇంటిపోరుతో బీజేపీలో చేరికలు ఆగిపోయాయి. ఒక్కరు చేరితే నలుగురు బయటకు పోతున్నారనే చందంగా పరిస్థితి తయారైంది.

Spread the love