అనాథ పిల్లల కోసం సోనూసూద్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌

నవతెలంగాణ – బిహార్‌
కరోనా సమయంలో వేల మందికి సాయం చేసి రియల్‌ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్‌ తన సేవలను కొవిడ్ తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. అవసరం అని ఎవరు తన తలుపు తట్టినా సాయం చేయడానికి ఆయన ముందుకు వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో సోనూకు వచ్చే రిక్వెస్టులు మామూలుగా ఉండవు. అయినా ఆయన ప్రతి విజ్ఞప్తికి స్పందించి తనవంతు సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోనూసూద్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అనాథ పిల్లలకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. బిహార్‌కు చెందిన ఓ యువకుడు సోనూసూద్‌పై ఉన్న అభిమానంతో అనాథ పిల్లల కోసం ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభించాడు. ఇప్పటికే అందులో 100 మంది పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్‌ అక్కడికి వెళ్లి ఆ యువకుడితో మాట్లాడారు. ఆయనతో చర్చించిన తర్వాత.. పిల్లలకు మెరుగైన వసతి, విద్య, ఆహారం అందించడానికి కావాల్సిన సాయం చేశారు. అంతేకాదు ఆ పిల్లల కోసం కొత్తగా స్కూల్‌ బిల్డింగ్‌ను కూడా కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇకపై ఆ పిల్లల బాధ్యతలో తాను కూడా భాగమవుతానని పేర్కొన్నారు.

Spread the love