టీఎస్‌ ఐపాస్‌తో ఉపాధి అవకాశాలు

– వస్తు తయారీ రంగంలో జపాన్‌ అగ్రగామి
– పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-షాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం చందన్‌వెళ్లి పారిశ్రామిక వాడలో జపాన్‌కు చెందిన డైపూర్‌ ఇంట్రాలాజిస్టిక్స్‌ ఇండియా, నికోమాక్‌ కిషా ఆటోమోటెడ్‌ మ్యాన్యుఫ్యాక్టరింగ్‌ కంపెనీ ఏర్పాటుకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. హిరోషిమా, నాగసాకిపై అణుబాంబుల విధ్వంసాన్ని తట్టుకొని జపాన్‌ తనదైన శైలిలో అభివృద్ధి చెంది, ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. జపాన్‌ కంపెనీల ఆధ్వర్యంలో నిర్మించనున్న పరిశ్రమతో.. చందన్‌వెళ్లి రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక హబ్‌గా రూపాంతరం చెందుతుందన్నారు. రూ.575 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తున్న ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా 1800 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వికారాబాద్‌ జిల్లాలోని ఐటీఐని ఈ సంస్థ దత్తత తీసకొని, ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ ఇచ్చి.. ఉపాది కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. చందన్‌వెళ్లి పారిశ్రామిక వాడలో ప్రతిష్టాత్మకమైన ఆమెజాన్‌, వెల్సన్‌, కుందన్‌, కటెరా, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలు ఈ ప్రాంతవాసులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు.
అలాగే సీతారాంపూర్‌లోని పారిశ్రమికవాడలో వోలెక్ట్రా ఎలాక్ట్రానిక్‌ వెహికిల్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను త్వరలోనే ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఐ పాస్‌ ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు ఇస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్‌లో షాబాద్‌ మండలానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జపాన్‌ కాన్సోలేట్‌ జనరల్‌ మైసూకి తాగా, ఎండీ శ్రీనివాస్‌ గరిమెళ్ల, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయష్‌ రంజన్‌, టీఎస్‌ ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కార్తీక్‌రెడ్డి, చందన్‌వెళ్లి సర్పంచ్‌ కొలన్‌ ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love