– 28న జరిగే మహా ధర్నా విజయవంతం చేయాలి…
– పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు,ఆసాములకు, వస్త్ర పరిశ్రమ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని తంగళ్ళపల్లి ఆసాముల సంఘం అధ్యక్షులు గోనె పరుశరాములు, పవర్లుమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కుడిక్యాల కనకయ్య అన్నారు.పవర్లూమ్ కార్మికుల, ఆసాముల ముఖ్య నాయకుల సమావేశాన్ని సోమవారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు గత మూడు మాసాల నుంచి పని లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.యజమానులు మాంద్యం ఉందని పరిశ్రమలు మూసివేస్తున్నారని ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు.కార్మికులకు రావలసిన యారన్ సబ్సిడీ , బతుకమ్మ చీరల బకాయిలు ప్రభుత్వం విడుదల చేయడంలేదని ఆరోపించారు.ప్రభుత్వం నేత కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు.ఇప్పటికే అనేక దఫాలుగా మంత్రులకు,అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన ఎలాంటి స్పందన ప్రభుత్వం నుంచి రావడం లేదన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వస్త్ర పరిశ్రమ మొత్తం కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుందన్నారు. ఆసాముల,కార్మికుల కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దయనీయంగా మారాయన్నారు.ప్రభుత్వం ఉన్న పలంగా బతుకమ్మ చీరల ఆర్డర్లు బకాయిలు విడుదల చేస్తేనే కొంత కార్మికులకు పని దొరికే అవకాశం ఏర్పడుతుందని, లేకుంటే కార్మికులు , ఆసాములు పస్తులు ఉండే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం ఇంత పెద్ద సమస్య ఉన్నా కూడా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 28న తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమాన్ని కార్మికులు,ఆసాములు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో గోరంతల రాజమల్లు ,సిరిపురంరమేశ్ , ఎక్కల్దేవి శంకర్ , గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు.