ఐదేండ్లలో ఓ బ్రిడ్జి కూడా కట్టలే

– కిషన్‌రెడ్డి అసమర్ధ నాయకుడు
– రాష్ట్రానికి కేంద్రం గాడిద గుడ్డునిచ్చింది
– బలహీనవర్గాలకు ఈటల ఏం చేశారు : అంబర్‌పేట, ఉప్పల్‌ రోడ్‌షోలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-అంబర్‌పేట/ ఉప్పల్‌
రాష్ట్రంలో ఎవరైనా అసమర్ధ నాయకుడు ఉన్నారంటే అది కేవలం కిషన్‌ రెడ్డి మాత్రమే అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, సికింద్రాబాద్‌ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి అంబర్‌పేట నియోజవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఇన్నేండ్లలో కనీసం ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని పూర్తి చేయలేకపోయారని, అలాంటి అసమర్ధ నాయకుడిని ఎన్నుకోవడం వృథా అని అన్నారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే దానం నాగేందర్‌ను ఎంపీగా గెలిపించాలని కోరారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ అంబర్‌పేట నియోజక వర్గం ఫీవర్‌ ఆస్పత్రి దగ్గర, ఉప్పల్‌లో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పది సంవత్సరాల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సొమ్మును దోచుకుంటూ దోపిడీ చేశాయని తెలిపారు. అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పదేండ్లు ప్రధానిగా ఉన్న మోడీ ఈ ప్రాంతానికి పది పైసలు కూడా ఇయ్యకుండా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించలేదని, మెట్రోను పొడిగించలేదని, నగరానికి వరదలు వస్తే కనీసం నిధులు విడుదల చేయలేదని, ఐటీఆర్‌ ప్రాజెక్టును గుజరాత్‌కు తరలించుకు పోయారని, రాష్ట్రానికి రావాల్సిన రైల్వే కోచ్‌ కూడా గుజరాత్‌కి తీసుకెళ్లారని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్‌ సర్కారు ఉన్నప్పుడు ఐటీఐఆర్‌ కారిడార్‌ కోసం అనుమతులిస్తే.. వాటిని మోడీ రద్దు చేశారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. ఆరు గ్యారంటీలు కేటీఆర్‌కు కనబడకపోతే చీర కట్టుకొని చింతమడక నుంచి సిరిసిల్ల వరకు బస్సు ఎక్కితే.. అమలు అవుతున్నాయో లేదో తెలుస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, కాంగ్రెస్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి దాన నాగేందర్‌, ఖైరతాబాద్‌ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ రోహిన్‌ రెడ్డి, సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, నాయకులు, దశరథ్‌, మహేందర్‌, రాములు, షబానా, కాంగ్రెస్‌ నాయకులు మాజీ కార్పొరేటర్లు గరిగంటి శ్రీదేవి రమేష్‌, పులి జగన్‌, దిడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
నిలిచిపోయిన ఫ్లైఓవర్‌ గురించి ఈటల కేంద్రాన్ని అడిగారా..
గతంలో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ బలహీనవర్గాల కోసం ఏమైనా చేశారా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతామహేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఉప్పల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. పంపకాల్లో తేడాలొచ్చి బీఆర్‌ఎస్‌ నుంచి రాజేందర్‌ బయటకు వచ్చారని, ఉప్పల్‌లో పనులు నిలిచిపోయిన ఫ్లైఓవర్‌ గురించి కేంద్రాన్ని ఎప్పుడైనా ఈటల అడిగారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పోటీలోనే లేదని, సునీతామహేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి సునీతామహేందర్‌రెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love