ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలి: ఎస్.సురేష్

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
ఉపాధి హామీ పనికి వచ్చే ప్రతి ఒక్కరికి  జాబ్ కార్డులు ఇవ్వాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎస్.సురేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  గురువారం మండలంలోని  బషీరాబాద్ గ్రామంలో కాడి చెరువులో ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలతో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎస్.సురేష్ మాట్లాడుతూ 2005లో ఇచ్చిన జాబ్ కార్డులు తప్ప ఇంతవరకు కొత్త జాబు కార్డులు ఇవ్వలేదని, ఒక్కొక్క కార్డు మీద ఆరుగురు ఏడుగురు ఉన్నారని ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.2005-06 సంవత్సరంలో అనేక పోరాటాల ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం వచ్చిందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బడ్జెట్లో కోతలు పెడుతుందన్నారు. పని మీదికి వచ్చేటప్పుడు, పోయేటప్పుడు వేలిముద్రలు పెట్టాలని, కొలతలతో పనిచేయాలని అనేక ఆంక్షలు పెడుతూ కార్మికులను పనికి దూరం చేయాలనే ఆలోచనతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎవరికి లేని నిబంధనలు కూలి నాలి చేసుకునే వారికి పెట్టడం అనేది హేయమైన చర్య అని విమర్శించారు. ఇప్పటికైనా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు రోజువారిగా 600 రూపాయలు ఇవ్వాలని, ఫీల్డ్ అసిస్టెంట్ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి 20 వేల రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెట్లకు నెలకు 10వేల రూపాయలు ఇవ్వాలని, ప్రతి కూలీకి గుర్తింపు కార్డు ఇవ్వడంతోపాటు  ప్రతి మనిషికి 200 రోజులు పని కల్పించాలన్నారు. ప్రమాద బీమా ప్రభుత్వమే చెల్లించి ఇన్సూరెన్స్ కట్టాలన్నారు.
Spread the love