‘బ్లాక్‌ బాక్స్‌’గా ఈవీఎంలు

'బ్లాక్‌ బాక్స్‌'గా ఈవీఎంలు– వీటిని పరిశీలించే అనుమతి ఎవరికీ ఉండదు
– భారత ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై ఆందోళనలు
– కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌
– ఈవీఎంలపై ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌ ట్యాగ్‌
న్యూఢిల్లీ : భారత్‌లో ఈవీఎంలపై కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. ఈవీఎంలను బ్లాక్‌ బాక్స్‌తో పోల్చారు. వీటిని పరిశీలించటానికి ఎవరికీ అనుమతి ఉండదని పేర్కొన్నారు. భారత ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై ఆందోళనలు తలెత్తుతున్నాయని ఆయన నొక్కి చెప్పారు. సంస్థలలో జవాబుదారీతనం లోపించినపుడు ప్రజాస్వామ్యం బూటకమనీ, మోసానికి గురవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన ట్వీట్‌ చేశారు. ముంబయి నార్త్‌ నుంచి 48 ఓట్ల తేడాతో విజయం సాధించిన శివసేన అభ్యర్థి విషయంలో వచ్చిన ఒక వార్త కథనాన్ని రాహుల్‌ తన పోస్ట్‌కు ట్యాగ్‌ చేశారు. ఈవీఎంను అన్‌లాక్‌ చేసే ఫోన్‌ శివసేన అభ్యర్థి బంధువు వద్ద ఉన్నదన్నది ఆ కథనం సారాంశం. కాగా, ఈవీఎంలను వాడొద్దనీ, వాటిని మానవులు లేదా ఏఐతో హ్యాక్‌ చేసే అవకాశమున్నదనీ, ఇది దేశానికి నష్టాన్ని కలగజేస్తుందని టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ చేసిన ట్వీట్‌ను సైతం రాహుల్‌ ట్యాగ్‌ చేశారు. ఈవీఎంల వినియోగంపై ఎలన్‌ మస్క్‌ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన విషయం విదితమే. అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న నేపథ్యంలో మస్క్‌ పై వ్యాఖ్యలు చేశారు. ఎలన్‌ మస్క్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఈవీఎంల వినియోగంపై భారత్‌లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌ ఈవీఎంలపై ట్వీట్‌ చేశారు. భారత్‌లో ఈవీఎంల పనితీరుపై పలు ప్రతిపక్ష పార్టీలు ఎప్పటి నుంచో ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. వంద శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలన్న డిమాండ్‌ను ఆ పార్టీలు చేస్తున్నా.. అది కార్యరూపం దాల్చటం లేదు.

Spread the love