ఎగ్జిట్‌పోల్స్‌ ఎన్డీఏ వైపే

Exit polls are towards NDA– 350 సీట్లకు పైగానే అంటున్న అంచనాలు
– ఇండియా బ్లాక్‌కు దాదాపు 150 స్థానాలు
– ఇతరులకు 50లోపే
– ఎగ్జిట్‌-పోల్స్‌ ఫలితాల విడుదల
– ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించట్లేదు:విమర్శకులు
దాదాపు రెండు నెలల పాటు హౌరాహౌరీగా సాగిన ఎన్నికల సంగ్రామం తుది దశ పోలింగ్‌తో శనివారం ముగిసింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గానూ ఏడు దశల్లో జరిగిన ఎన్నికలతో భారత్‌ ఒక మహా ఘట్టాన్ని పూర్తి చేసుకున్నది. దీంతో ఎన్నికలు ముగిసే వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల విడుదలపై ఉన్న ఎన్నికల సంఘం(ఈసీ) నిషేధం శనివారం సాయంత్రం నాటికి తొలగిపోయింది. అప్పటి వరకు ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు సాయంత్రం 6.30 గంటల తర్వాత విడుదలయ్యాయి. పలు జాతీయ, ప్రాంతీయ వార్తా ఛానెళ్లు, సర్వే సంస్థలు తాము నిర్వహించిన సర్వే ఆధారంగా పలు పార్టీలు, కూటములకు వచ్చిన సీట్లను, ఓటింగ్‌ శాతాన్ని రాష్ట్రాలవారీగా విడుదల చేశాయి.
న్యూఢిల్లీ : ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో ఎన్డీయేదే పైచేయిగా కనిపించింది. ఆ కూటమి 350కి పైగా లోక్‌సభ స్థానాలను గెలవచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు అంచనా వేశాయి. ఇండియా బ్లాక్‌ ఈ సర్వే ఫలితాల్లో దాదాపు 150 స్థానాలను మాత్రమే కైవసం చేసుకోనున్నట్టు తేలింది. ఇతరులు దాదాపు 50 లోపు లోక్‌సభ సీట్లు గెలవచ్చని అంచనా. ఇక ఈ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు భిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకు.. ఒక సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీనే తిరిగి అధికారం చేపడుతుందని చెప్పగా, మరో సంస్థ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఫలితాలను అంచనా వేసింది. ఇక్కడ టీడీపీ-జనసేన-బీజేపీల కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పటం గమనార్హం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలవారీగా విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లోనూ ఇదే తీరు కనిపించింది.
దేశవ్యాప్తంగా ఇలా..ఇక దేశవ్యాప్తంగా పలు సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఇలా ఉన్నాయి. ఎన్డీటీవీ ‘పోల్‌ ఆఫ్‌ పోల్స్‌’ ఎన్డీయే 365 స్థానాలను గెలుస్తుందని అంచనా వేసింది. అలాగే, ఇండియా బ్లాక్‌ 142 స్థానాలు, ఇతరులు 36 స్థానాల్లో విజయం సాధిస్తారని వివరించింది. ఇండియా న్యూస్‌-డి-డైనమిక్స్‌ సర్వే ప్రకారం.. ఎన్డీయే 371 సీట్లు, ఇండియా 125, ఇతరులు 47 స్థానాల్లో విజయం సాధించనున్నారు. రిపబ్లిక్‌ భారత్‌-మ్యాట్రైజ్‌ ప్రకారం.. ఎన్డీయే 352-368 మధ్య, ఇండియా బ్లాక్‌ 118-133 సీట్లు, ఇతరులు 43 నుంచి 48 స్థానాలు కైవసం చేసుకోనున్నారు. రిపబ్లిక్‌ టీవీ- పీ మార్క్‌ ప్రకారం.. ఎన్డీయే 359, ఇండియా 154, ఇతరులు 30 సీట్లకు మాత్రమే పరిమితం కానున్నారు. జన్‌ కీ బాత్‌ ప్రకారం.. ఎన్డీయే 362-392, కాంగ్రెస్‌ 141 నుంచి 161 స్థానాలు, ఇతరులు పది నుంచి 20 లోక్‌సభ సీట్లను గెలవనున్నారు. న్యూస్‌ నేషన్‌ సర్వే ప్రకారం.. ఎన్డీయే 342-378 సీట్లు, ఇండియా బ్లాక్‌ 153 నుంచి 169 సీట్లు, ఇతరులు 21 నుంచి 23 లోక్‌సభ స్థానాలను గెలవనున్నట్టు అంచనా.
రాష్ట్రాలవారీగా..
దక్షిణాదిలో మాత్రం బీజేపీకి చేదు ఫలితాలే రానున్నాయని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చెప్తున్నాయి. తమిళనాడులో రెండెంకెల స్థానాలను గెలుస్తామన్న బీజేపీ ఆశలు అడియాశలవుతున్నట్టు తెలుస్తున్నది. ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా పోల్‌ సర్వే సమాచారం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. ఈ సర్వే ఫలితాల ప్రకారం పలు రాష్ట్రాల్లో ఆయా పార్టీలు, కూటములు గెలుచుకునే స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 2 నుంచి 4 స్థానాలు మాత్రమే గెలుస్తుందని చెప్పింది. అధికార డీఎంకే సాయంతో ఇండియా కూటమి ఇక్కడ 33-37 స్థానాల్లో గెలుపొందనున్నది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమి మాత్రం ఇక్కడ 0-2 సీట్లు మాత్రమే గెలవనున్నదని అంచనా. కర్నాటకలో ఎన్డీయే 23-25 స్థానాలు, ఇండియా బ్లాక్‌ 3-5 సీట్లు గెలవనున్నది. కేరళలో ఎన్డీయే 2-3 సీట్లు, యూడీఎఫ్‌ 17-18 స్థానాలు, లెఫ్ట్‌ 0-1 స్థానం కైవసం చేసుకోనున్నట్టు చెప్పింది. బీహార్‌లో ఎన్డీయే 29 నుంచి 33, ఇండియా 7 నుంచి 10 స్థానాల్లో, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్డీయే 10-11, ఇండియా 0-1 స్థానాల్లో, జార్ఖండ్‌లో ఎన్డీయే 8-10 సీట్లు, ఇండియా బ్లాక్‌ 4-6 సీట్లను కైవసం చేసుకోనున్నాయని వెల్లడించింది. అయితే ఈ ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు ఊహించినవేననీ, ఇవేవీ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదనే విమర్శలూ వెలువడుతుండటం గమనార్హం.

Spread the love