కవితకు కస్టడీ పొడిగింపు

Custody of poetry extension– రౌస్‌ ఎవెన్యూ కోర్టు తీర్పు
– బీజేపీకి ఓటు వేయొద్దు..: కవిత
– అప్పుడెందుకు అరెస్టు చేయలేదని నిలదీత
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్‌స్కాం మనీలాండరింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్‌ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించింది. 23న తిరిగి ఆమెను కోర్టు ముందు హాజరు పరచాలని ఈడీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ అయిన కవితకు గత నెల 26న రౌస్‌ ఎవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఆ కస్టడీ సమయం ముగియడంతో మంగళవారం ఆమెను మరోసారి అధికారులు కోర్టు ముందు హాజరుపరించారు. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తరపు న్యాయవాది జోహెబ్‌ హుస్సేన్‌ వర్చువల్‌ మోడ్‌ లో వాదనలు వినిపించారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని కోర్టుకు నివేదించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలకదశలో ఉందని, ఆమె కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని కోరారు. అయితే ఈ వాదనలపై కవిత తరపు న్యాయవాది నితీశ్‌ రాణా అభ్యంతరం తెలిపారు. కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగించడానికి ఈడి వద్ద కొత్తగా ఏమి లేవన్నారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతుందని, అప్పటి నుంచి కవిత దర్యాప్తును ప్రభావితం చేసే వ్యక్తి అని ఈడీ ఆరోపిస్తోందన్నారు. కానీ అలాంటిదేమీ కవిత చేయలేదన్నారు. ఇరు వైపుల వాదనలు ముగించిన స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా… తీర్పును కాసేపు రిజర్వ్‌ చేశాక.. కవితకు 14 రోజుల కస్టడీ పొడిగిస్తున్నట్టు తీర్పు వెల్లడించారు.
అంతకు ముందు కోర్టు హాల్‌ లోనే కవితతో మాట్లేడేందుకు కుటుంబ సభ్యులకు అనుమతివ్వాలని ఆమె తరపు న్యాయవాది రాణా కోర్టును కోరగా, స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా నిరాకరించారు. అయితే అందుకోసం అప్లికేషన్‌ వేసుకోవాలని సూచించారు. న్యాయమూర్తి సూచనలతో కవిత భర్త అనిల్‌, మామ రామ కిషన్‌రావు, మరిది కలిసేందుకు అనుమతివ్వాలని అప్లికేషన్‌ దాఖలు చేయడంతో, అందుకు కోర్టు అనుమతించింది. తరువాత కోర్టు హాల్‌లోనే కవితతో భర్త, మామ, మరిది కలిసి కాసేపు మాట్లాడారు.
బీజేపీకి ఓటేయొద్దు : కవిత
తన కోసం కోర్టుకు వచ్చిన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలను, ప్రతి అభిమానిని, పలకరిస్తూ కవిత ధైర్యంగా కన్పించారు. కోర్టు హాల్‌ నుంచి బయటకు వచ్చే సమయంలో ఆమె మీడియా ప్రశ్నలకు స్పందించలేదు. ఇది పూర్తిగా రాజకీయ పరమైన కేసని ఆరోపించారు. తాను పూర్తిగా విచారణకు సహకరిస్తున్నా, అన్యాయంగా అరెస్ట్‌ చేశారని చెప్పారు. ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ ఈడీ, సీబీఐని ఊసిగొల్పుతోందన్నారు. ఇప్పటికే జైల్లో సీబీఐ తన స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసిందన్నారు. అయితే.. తెలంగాణ ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటని మీడియా మిత్రులు అడుగగా… బీజేపీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు.
ఆమె మరింత బలంగా బయటకు వస్తారు : భర్త అనిల్‌
తీహార్‌ జైలు నుంచి కవిత మరింత బలంగా బయటకు వస్తారని ఆమె భర్త అనిల్‌ అన్నారు. అక్రమంగా కేసులో ఆమెను అరెస్ట్‌ చేశారని, జైల్లో పెట్టినప్పటికీ ఆమె ధైర్యంగా ఉన్నారని తెలిపారు. మానసికంగా, దృఢ నిశ్చయంతో కవిత న్యాయపోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. కవిత పూర్తి స్థాయిలో బలంగా ఉందన్నారు. ఎలాంటి అధైర్యం అవసరం లేదని, ఆమె మరింత బలంగా బయటకు వస్తారని దీమా వ్యక్తం చేశారు. అలాగే సోమవారం తీహార్‌ జైల్లో కవితతో ములాఖత్‌ అయినట్టు వెల్లడించారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ ములాఖత్‌లో కవిత ఏమాత్రం ఆందోళన లేకుండా కనిపించారన్నారు. జైల్లో ఉన్నప్పటికీ కవిత ఏ పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవడం లేదన్నారు. పార్టీ శ్రేణులు, ఆమె అభిమానులు ధైర్యంగా ఉండాలన్నారు.
అప్పుడెందుకు అరెస్ట్‌ చేయలే కేసులో నేను బాధితురాలినే తన వ్యక్తిగత ప్రైవసీని మీడియా దెబ్బతీస్తోంది నాలుగు పేజీల లేఖను రిలీజ్‌ చేసిన కవిత
సాక్షులను బెదిరిస్తున్నట్టు తనపై ఆరోపణలు చేస్తోన్న ఈడీ, బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనను ఎందుకు అరెస్టు చేయలేదని కవిత ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఎలాంటి శక్తిని అదుపు చేయలేమన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా తనను ఇప్పుడు అరెస్టు చేశారని విమర్శించారు. రెండున్నరేండ్ల విఫల దర్యాప్తు అనంతరం ఈడీ తనను అదుపులోకి తీసుకుందని ఆరోపించారు. మంగళవారం కోర్టులో హాజరైన సందర్భంలో స్పెషల్‌ జడ్జ్‌ ముందు తన ఆవేదనను వెలిబుచ్చుకునేందుకు కవిత నాలుగు పేజీల్లో పలు అంశాలను రాసుకొచ్చారు. అయితే, కోర్టు అందుకు అనుమతించకపోవడంతో మీడియాకు ఆ పేపర్లను విడుదల చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో తాను బాధితురాలినని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని కవిత తెలిపారు. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నట్లు ఢిల్లీ లిక్కర్‌ పాలసీ రూపకల్పనతో తనకు ఆర్థికంగా ఎలాంటి లబ్ది చేకూరలేదన్నారు. ‘నా మొబైల్‌ నెంబర్‌ను టీవీ ఛానల్‌లలో ప్రసారం చేసి నా ప్రైవసీని దెబ్బతీశారు. సీబీఐ, ఈడీ దర్యాప్తుల కంటే ఎక్కువగా మీడియా విచారణ రెండున్నరేండ్లుగా జరిగింది. రాజకీయంగా, వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దెబ్బతీసేలా మీడియా వ్యవహరిస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థల ముందు నాలుగు సార్లు విచారణకు హాజరయినట్టు తెలిపారు. విచారణకు అన్ని విధాలా సహకరిస్తున్నట్లు వెల్లడించారు. దర్యాప్తు సంస్థలు అడిగిన బ్యాంకు వివరాలతో పాటు, తన దగ్గర ఉన్న సమాచారాన్ని అందజేసినట్లు స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థకు తన మొబైల్‌ ఫోన్‌లు అన్నీ అందజేశానని, కానీ వాటిని ధ్వంసం చేసినట్టు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాంగ్మూలాలను తరచూ మార్చుతూ వస్తోన్న సహ నిందితుల స్టేట్‌మెంట్స్‌తో కేసును నడిపిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజరు ఖన్నా విచారణ సందర్బంగా ప్రస్తావించారని చెప్పారు. గత రెండున్నరేండ్లుగా కేసులో భాగంగా అనేక సోదాలు జరిపారన్నారు. భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారని, చాలామందిని అరెస్ట్‌ చేశారని తెలిపారు.
బీజేపీలోకి చేరితే కేసులకు బ్రేక్‌
సుప్రీంకోర్టులో కఠిన చర్యలు తీసుకోబోము అని చెప్పి, కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈడీ తనను అరెస్ట్‌ చేసిందని ఆరోపించారు. 95 శాతం కేసులు అన్నీ ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించినవేనని, బీజేపీలోకి చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతుందన్నారు. పార్లమెంటు సాక్షిగా బీజేపీ నేతలు ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి ”నోరు మూసుకోండి లేదా ఈడీను పంపుతాం” అన్నారని లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ న్యాయవ్యవస్థ వైపు చూస్తున్నాయని అన్నారు.
న్యాయ వ్యవస్థ ఉపశమనం కల్పిస్తుందని ఆశతో ఉన్నట్లు నాలుగు పేజీల సందేశంలో రాసుకొచ్చారు. ‘కేసు దర్యాప్తునకు సహకరించేందుకు నేను పూర్తి సిద్ధంగా ఉన్నా. ఈ పరిస్థితుల్లో నాకు బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నాను. ‘నా చిన్న కుమారుడు పరీక్షలకు సిద్ధపడుతున్న సమయంలో తల్లిగా నేను తనతో ఉండాలి. నా పాత్రను ఎవరు భర్తీ చేయలేరు. నేను లేకపోవడంతో నా కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నాను’ అని ఆమె విజ్ఞప్తి చేశారు.
తన బెయిల్‌ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా కోర్టును కోరుతున్నట్లు ఆమె తెలిపారు.

Spread the love