నవతెలంగాణ – ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే స్వగ్రామం అంకాపూర్‌లోని ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంతో పాటు అంకాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 163 అమలు చేశారు.
ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అలాగే నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొట్లాడి ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేక యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా నేను మాట్లాడడం తప్ప, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై చర్చకు వస్తే మాట్లాడడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటికి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.


