వ్యవసాయంలోనే ‘సాయం’ చేసే గొప్ప లక్షణం ఉందంటారు సాహితీవేత్తలు. అగ్రికల్చర్‌లోనే మన ‘కల్చర్’ దాగుందంటారు పెద్దలు. భూమితో అనుబంధమున్న రైతులు, దేశానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతల ఔన్నత్యాన్ని చెప్పటానికి ఈ రెండు వాక్యాలు చాలేమో. బహుశా… వీటి గురించి బహు చక్కగా తెలిసిన వ్యక్తి కాబట్టే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…’రైతు బంధు’ ‘వ్యవసాయానికి 24 గంటల కరెంటు’ తదితర పథకాలు పెట్టారంటూ మురిసిపోతుంటారు ఆయన అభిమానులు, బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు. ఈ సంగతిని అటుంచితే… గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎక్కువగా ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతున్న గులాబీ దళపతి అక్కడ ఏం చేస్తున్నారనే ప్రశ్న అందరి మెదళ్లలోనూ మెదులుతోంది. ఆయన మాంచి పుస్తక ప్రియుడు, ఇప్పటిదాకా 80 వేల పుస్తకాలు చదివారు, కాబట్టి ఇప్పుడు కూడా అదే పనిలో ఉంటారని కొందరు కారు పార్టీ నేతలు అభిప్రాయపడుతుంటే.. ‘కాదు.. కాదు..శిశుపాలుడిలాంటి కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను శ్రీకృష్ణుడిలా లెక్కబెడుతూ, ప్రజా సమస్యలపై పోరుకు, సంబంధిత వ్యూహాలకు పదును పెడుతున్నారు…’ అంటూ మరికొందరు బీఆర్‌ఎస్ బాస్ గురించి చెబుతున్నారు. ‘ఇదంతా కాదుగానన్నా… ఇంతకీ పెద్ద సారు ఫామ్‌హౌస్‌లో ఏం చేస్తున్నారు?’ అని అత్యంత సన్నిహితుడిని అడగ్గా…’ఆయనే స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు…’ అని ఠక్కున చెప్పారు. అవునా అని సందేహం వ్యక్తం చేయగా…’పర్యావరణాన్ని కాపాడే, ఆక్సిజన్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే వెదురు(బాంబూస్)ను సారు సాగు చేస్తున్నారు. మొత్తం 36 ఎకరాల్లో ఆ పంటను వేసి, రోజూ స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నారు…’ అంటూ చెప్పుకొచ్చారు. దటీజ్ ద మేటర్…
– బివియన్ పద్మరాజు