Sunday, May 31, 2026
E-PAPER
Homeదర్వాజఅచ్చ తెలంగాణ జీవిత కథలు

అచ్చ తెలంగాణ జీవిత కథలు

- Advertisement -

అతను వెన్నెల్లో నాయనమ్మ ముచ్చట్లను మూటకట్టుకొచ్చాడు. అతను బతుకమ్మలో ఒక్కొక్క పువ్వును పేర్చుకుంటూ పాడేపాటల్లోని కథలను మనకు అందించాడు. మనందరి తెలంగాణ జీవితాన్ని మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశాడు. R.k నారాయణ్ మాల్గుడిడేస్ కథలవలే తెలంగాణ యాసలో “కుమ్మరికుంటోన్ని మనముందుకు తెచ్చాడు. అయితే మాల్గుడి డేస్ పూర్తిగా కల్పిత కథలు చెమన్ రాసిన “కుమ్మరి కుంటోని కథలు” పూర్తిగా యదార్ధ కథలు. ఒక్కొక్కటీ చదివితే అది అతని బాల్యం, ఏకబిగిన చదివితే అది నవల, చదివి పుస్తకం మూస్తే అది తెలంగాణ బతుకు చిత్రం… ప్రఖ్యాత జపాన్ రచయిత్రి “టెక్సికోకురియోనాగి” రైలుబడిలో గడిచిన తన బాల్యాన్ని టొటోచాన్ పాత్రతో నవలగా రాసింది. ఇక్కడ చెమన్ “కుమ్మరికుంటోని కథలు” తన జీవితంలో జరిగిన సంఘటనలను కథలుగా అందించాడు. తెలుగులో అందులోనూ తెలంగాణ భాషలో బతుకు జ్ఞాపకాలను పూరెక్కల్లా మనముందు కుప్పపోస్తాడు. జ్ఞాపకాలంటే జ్ఞాపకాలు కావు, అది అతని జీవితం. అతన్ని ఉన్నతమైన వ్యక్తిత్వంగల మనిషిగా నిలబెట్టిన జీవితం. అతని జీవితమే కాదు అది మనందరి జీవితం. అతను ఊరిని మరువలేదు, అమ్మను వదలలేదు. ఊర్లె ఉన్నప్రతి చెట్టూ, ప్రతి చెరువుకట్ట, ప్రతి మనిషి, మట్టిలో అణువణువు అతని గుండెల్లో గూడుకట్టికొని, అతని మనసును మల్లెతీగల్లా అల్లుకొని ఉండిపోయాయి. ఆ జ్ఞాపకాలే కుమ్మరికుంటోని కథలను సువాసన భరితం చేసాయి.

“అమ్మమ్మ ఏడ్పు” అనేది మొదటి కథ. ఈకథలో అమ్మతో “కుమ్మరికుంట” అనే తను పుట్టిన ఊరుకు చేరుకుంటాడు. తొవ్వలో అమ్మనడుస్తుంటే, ఆమెతో నడుస్తూ, ముందుకు ఉరికి మల్ల అమ్మ వచ్చేదాక ఆగి, మల్లా పరిగెడుతూ, తొవ్వలో అమ్మ తెంపి ఇచ్చే కందికాయలు తింటూ, ఊరుగురించి తెలుసుకుంటాడు. కుమ్మరికుంటకు పిల్లవానితోపాటుగా మనమూ నడుస్తూంటాము, కొద్దిసేపటికి ఆ పిల్లవాడు మనమే అవుతాము. అందంగా పసితనపు అమాయకత్వం లోంచి కథనం చెప్పేవిధానం వల్ల మనం మనకు తెలియకుండానే కథలోని పిల్లగాని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తాం. ఈ కథలన్నీ సున్నితమైన తెలంగాణ పదాల అల్లికతో సాగుతాయి అతని కవిత్వంలాగనే. చెమన్ గాఢత కలిగిన, లాలిత్యమైన పదాల కూర్పుతో, సామాజిక ఆలోచనలతో రాసే కవిగా తెలుగు సమాజానికి పరిచయమే కుమ్మరికుంటలో పుట్టి, బోధన్ లో నాన్నతో ఉండి ,మళ్లా మూడేళ్ల వయసులోనే తిరిగి కుమ్మరికుంటకు చేరుకుంటాడు. అమ్మఒంటరిపోరాటం తెలియకనే అక్కడే, ఆ ఊర్లనే తనజీవితాన్ని మొదలుపెట్టాడు. ఊరు అతనికి జీవన విధానాన్ని నేర్పింది. జీవితానికి సరిపడా జ్ఞాపకాలను ఇచ్చింది. AI ద్వారా ఈమధ్య పల్లెవాతావరణాన్ని, వేసవికాలపు అనుభూతులను ఓపాట జోడించి యూట్యూబ్స్ లోవస్తున్నాయి. అంతకంటే గొప్ప దృశ్యమాలిక ఈ “చెట్టుమీద సత్తిగాడు” కథ. ఆనాటి ఊరు, ఊర్లె మగ్గంనేసే తుమ్మ రామస్వామి, శాంతమ్మ చూపే ప్రేమ, ఆనాటి రాత్రి బడి, రాత్రిపూట ఆడే ఆటలు …..ఎంతో అద్భుతమైన రోజులను కళ్లముందుంచాడు రచయిత. చెమన్ ఆ అనుభూతి భరిత బాల్యంలోకి మనల్ని పరకాయ ప్రవేశం చేయిస్తాడు.
ఒకప్పుడు చదువులు అంటే ఇంత భారంగా ఉండేది కాదు, ఆడుతూపాడుతూ చదువు కొనసాగేది. సెలవుల్లో రెండవతరగతి పూర్తి చేసి మూడవ తరగతికి కానిగిర్ బడి నుండి సర్కారుబడికి పొయ్యేటప్పుడు, ఆపిల్లవాని మానసిక స్థితిని చెప్పకనే చెప్పేతీరు ఆకట్టుకుంటుంది.

వానల ఏడ్పు` కథలో 6వ తరగతిలో జాయిన్ కావడానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని హైస్కూల్ బడికి వెళ్లేప్పుడు, మధ్యలో పెద్దవాన బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఒక ఇంటి చూరు కింద నిలబడి. కాళీ ఉన్న వీధులు, పైనుండి జోరున కురుస్తున్న వాన, నల్ల మబ్బులతో ఆకాశం కమ్మేసి చీకటిగా మారినప్పుడు వీధుల్లో ఎవరూ లేని భయంకర ఒంటరితనములో, ఏమి చేయలేని పరిస్థితులో ఏడ్చి మళ్లీ ఏడుపును దిగ మింగుకొని ఆ భయంనుండి తప్పించుకోవడానికి హరిశ్చంద్రుని పద్యాలు అందుకుంటాడు. బహుశా అతని బతుకు పోరాటం అప్పుడే మొదలైంది కావచ్చు.
“ఛలో హైదరాబాద్, బొంబాయి పొయ్యి“ ఈరెండు కథలు చదివేటప్పుడు, పారిపోవడానికి వేసే పథకాలు, తెలివితేటలు ఆశ్చర్యం కలిగిస్తుంది. చివరకు వీళ్లు ఎటుబోతరు అనే ఉత్కంఠతతో సాగుతుంది. ఒక కల్పిత కథలా అనిపిస్తుంది. కానీ దీంట్ల ఉన్న ప్రతి వాడ, ప్రతి చెట్టు, ఇంటిపేర్లతో సహా, ప్రతి క్యరెక్టర్ వాస్తవం. ఈపాత్రల్లోని వారు ఇప్పటికీ అదే ప్రాంతంలో కొంతమంది స్థిరపడిఉన్నారు. కొంతమంది, వేరే ప్రాంతంలో స్థిరపడి ఉన్నారు. మొత్తం కథలలో అమ్మ భూమి పొరలలో జాలువారే నీటి ఊటలా వినబడుతూనే ఉంటుంది. ఊర్లె ప్రతివాడలో అతను జీవించాడు. ప్రతి ఇసుక రేణువులకు, గడ్డిపోచలకు, చింత మొలకలకు, బీరపువ్వులకుతన మనసును అంకితం చేసాడు. ఆటలుగా, పాటలుగా పారుతున్న కుమ్మరికుంటలో అతని మనుసు చిక్కుకు పోయింది. తెలియకుండానే ఒక సామాజిక చైతన్యవాతావరణం నిండిన పల్లె అది.

అందుకే ఇంతగొప్ప పుస్తకం బయటకు వచ్చింది. పుస్తకంలోని ప్రతి కథా చదువుతున్నప్పుడల్లా మనం ప్రతిసారి మన బాల్యంలోకి వెళ్లి వస్తూనే ఉంటాము. చదువుతున్నంత సేపు మనం ఇక్కడ ఉండము మనం పూర్తిగా మన బాల్యంలోనూ, మన గ్రామంలోనూ, మన స్నేహితులతోనూ, మనం తిరిగిన గ్రామీణ పరిసరాల గొప్ప అనుభూతుల్లోకి వెళ్లిపోతాం. పుస్తకంలోని కథలకు వేసిన బొమ్మలు కూడా పూర్తిగా ప్రతి కథకు న్యాయం చేసేవిగా ఉన్నాయి. తనకు అందుబాటులోకి వచ్చిన అన్ని సాహిత్యాలతో పాటు అతను చదువుకున్న రష్యన్ సాహిత్యం, ఒకవైపు చైనా సాహిత్యం అతనిలో కొత్త ఆలోచనలు రేకెత్తించడం మొదలైంది . సమాజం, చైతన్యం, సమూహం అనే పదాలకు అర్థం తెలుసుకోవడానికి నాంది ఆ పొద్దు. తెలంగాణలో ఇప్పటి తరానికి తెలియని పదాలను అంటే జముడిక, ఇర్రిర అవ్వడం , ఓనగాయలు, ఇర్రం మర్రం ఇట్లాంటి పదాలు అనేకం ఈ అచ్చ తెలంగాణ జీవిత కథలలో మనకు కనిపిస్తాయి.. నిజానికి ఈ కథలన్నీ పిల్లలకు నేర్పడానికి సిలబస్ లో చేర్పించాలి అప్పటి కాలం, అచ్చ తెలుగు పల్లెటూరి జీవితం, అప్పటి ఆటలు, పాటలు, సరదాలతో పాటుగా కఠినమైన జీవితాన్ని అనుభవిస్తూనే ఎదిగి వచ్చిన తీరును పిల్లలకు నేర్పే గొప్ప జీవిత సత్యాల పాఠంగా ఈ పుస్తకం సిలబస్ లో చేరిస్తే మరింతగా తెలంగాణ జీవితం గురించి రాబోయే తరాలకు తెలుస్తుంది.

సీహెచ్. ఉషారాణి, 9441228142

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -