నేను తాకానే అమ్మీ! గాంధీని
ముట్టుకున్నాను అమ్మీ!
పట్టులాంటి మృదువైన భుజాన్ని
నేను తాకాను అమ్మీ!
కడలి ఉప్పొంగినట్లుగా
జనసంద్రం చెలరేగగా
వైకం జెట్టీకి పడవ చేరింది
గాంధీ వచ్చారమ్మీ, మా ఊరికి
కాంతి వచ్చిందమ్మీ!
గాంధీ నేలపై కాలు పెట్టగా
శాంతి విత్తనం మేల్కొంది.
రెండు పళ్ళు లేని నవ్వులో
సూరీడే మెరిశాడు.
విత్తనం మొలకెత్తి చెట్లైనట్టు
వైకం పూలతోటగా మారింది
చూస్తుండగానే ఏమి మాయో!
పూలై విరాబూసిందమ్మీ, కాంతి
పూలై విరబూసిందమ్మీ!
నేనూ తాకానే అమ్మీ! గాంధీని
నేనూ తాకానే అమ్మీ!
పట్టులాంటి మెరిసే ప్రాణాన్ని
తాకానే అమ్మీ!
గాంధీ ఎక్కేందుకు తెరిచిన కారులో
నేనూ పరవశంగా వెంట సాగానే .
కారు అంచున నన్ను నేనే కట్టుకున్నాను.
పెద్ద కొండపై మబ్బు తునకలు జారినట్టుగా
పెద్ద సంద్రంలో చిన్న వాగు
కలిసినట్టుగా
రాముడికి రహీమ్‌లా
అయ్యప్పకి వావరులా
వైకం నాధుణ్నీ ఓ అణగారినోడు
చేరి తాకినట్టుగా
నేనూ తాకానే అమ్మీ! గాంధీని
తాకానే అమ్మీ!
పట్టు దారంలా నున్నని ఖల్బుని
తాకానే అమ్మి.
రెండు రోజులకి ఇండియా
రెండు ముక్కలైంది
రెండు వెలుగులు కలసినప్పుడు
మెరుపు పుట్టింది.
తొట్టతొలి దగ్గరుంచి
మూడు నిప్పుగోళాలు పరిగెత్తుకొచ్చాయి…
మోకాళ్లపై ఓ క్షణం తడబడింది,
వెనువెంటనే ఇండియా నేలకొరిగింది…
గాడ్సే తాకినాడమ్మీ! గాంధీని
గాడ్సే తాకినాడమ్మీ!
తుపాకీ వేళ్లతో గాడ్సే తాకినాడమ్మి
నేను తాకానే అమ్మీ!
కాంతిని తాకానే అమ్మీ!
చితాగ్నిలో కాలుతున్న
ఇండియాను తాకానే అమ్మీ!
మళయాల మూలం- అన్వర్ అలీ
తెలుగు అనువాదం- ఎమ్మన్యుఏల్ జే మరియా
(వైకం- కేరళలోని ఓ పుణ్యక్షేత్రం,
ఖల్బు- హృదయం)
గాంధీ స్పర్శ మాల
- Advertisement -
- Advertisement -


