తాత్వికత గురించి మాట్లాడినప్పుడల్లా
నేను అస్తిత్వవాదపు ఎముకలను కొరికే
అధమమైన క్రిమిని అనిపిస్తుంది నాకు
నా మాటల అల్పత్వాన్ని గ్రహించినప్పుడు
నేను భ్రమలనూ అధిభౌతికశాస్త్రాన్నీ
చెదరగొట్టే క్రోధకారక కీటకంగా మారినట్టు అనిపిస్తుంది
కాబట్టి నాతో రావడం సులభమైన విషయం కాదు
మనను వేరు చేసే దూరం డిజిటల్ వారసత్వాన్ని పరికిస్తూ
జంటకుండలీకరణాలలో దాగివుంటుంది
నేను పేర్లను మార్చలేను
నువ్వేమో సులభమైన ఎరవు
అందుకే నేను అవకాశాన్ని అందిపుచ్చుకుని
ఉన్నత వ్యక్తివైన నిన్ను దాటిపోతాను
మరి హంతకునికీ హతునికీ
మధ్య ఉండే అతి తక్కువ దూరాన్ని,
నీ బంకమట్టిని ఎక్కడ పెట్టాలి?
పొగమంచు లోంచి వచ్చే
మరో తాత్వికుని కోసం
విజ్ఞతతో నిరీక్షించవచ్చు
అప్పుడు ఇద్దరు వేదాంతులను
ఒకేసారి అవధరించాలి నువ్వు
అతని కంఠస్వరంలో బహుశా
తన తెల్లని దంతాలను మించిన అందం ఉంటుంది
అతని వెడల్పైన చేయి మా ఇంటి వెనుకభాగపు
బాల్కనీ లాగా విశాలంగా ఉండొచ్చు
అప్పుడు మనం ఒకకప్పు నీళ్లు తాగాలనుకుంటాం
నక్షత్రాలను లెక్కపెడుతున్నట్టు,
నింగిలో మిగిలిన ధూళిని
పోగు చేస్తున్నట్టు నటిస్తాం
నువ్వు నా జిడ్డువేదాంతానివి కనుక
మనం పాత జిత్తులను ఫాంటసీ సినిమాలను
జ్యోతిష్యాలను యుద్ధవిమానాలను
ఆంబులెన్స్ లను ప్రతినలను
కోపపు వాసనలను మరిచిపోదాం
చైతన్యం ప్రహసనంగా మారేదాకా
ఆ హేయమైన క్రిమి కోసం తవ్వుతూ పోయాను
అప్పుడు భూమి ఎన్నో చోట్ల
ఎగుడుదిగుడుగా ఉండింది
ఆంగ్లమూలం: టాగ్రిడ్ బో మెరి
అనువాదం: ఎలనాగ
నా తాత్వికత
- Advertisement -
- Advertisement -


