నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని మామిళ్ళపల్లి, జప్తి సదగోడు, దాసర్లపల్లి, అయ్యవారిపల్లి గ్రామపంచాయతీలో ఎల్ నినో ప్రభావం పై గురువారం గ్రామ సభలు నిర్వహించారు. అయ్యవారిపల్లి లో నిర్వహించిన గ్రామసభకు గ్రామ సర్పంచ్ జిల్లెల జగత్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి కొర్ర రమేష్ హాజరై రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
మండలంలోని వివిధ గ్రామపంచాయతీలలో నిర్వహించిన గ్రామసభల్లో ఎల్‌నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయంపై వాటి ప్రభావం తదితర అంశాలను రైతులకు విస్తృతంగా వివరించారు. అదేవిధంగా రైతులను మోసం చేసే అనధికారిక వ్యక్తులపై నిఘా పెట్టేందుకు ఏర్పాటు చేసిన నిఘా సమితుల విధులు, బాధ్యతలను వివరించారు.
గ్రామాల్లో రాత్రి వేళల్లో లేదా తెల్లవారుజామున అనధికారిక వ్యక్తులు తిరుగుతూ రైతులను ఆకర్షించేలా తక్కువ ధరలకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందిస్తామని నమ్మించి విక్రయించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వారిని గుర్తించి అరికట్టడం ద్వారా రైతులు ఆర్థికంగా నష్టపోకుండా చూడటమే నిఘా సమితుల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
రైతులు ఎల్లప్పుడూ అధికారికంగా అనుమతి పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకూ తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. అనుమానాస్పదంగా తక్కువ ధరలకు వస్తువులు విక్రయించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



