విద్యుత్ పనులను ఆపడం పట్ల చౌట్ పల్లి గ్రామ రైతుల ఆవేదన..

– ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలంటున్న బాధితులు  
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ భూముల్లో విద్యుత్ లైన్ పనులను అడ్డుకుంటున్నారని రెండు రోజుల కిందట తహసిల్దార్  కార్యాలయం ఎదుట పురుగు మందు డబ్బాలతో ధర్నా చేసిన విషయం తెలిసిందే. సోమవారం బాధిత రైతులు,  మాజీ సర్పంచ్ మారు శంకర్ వివాదాస్పద భూమి వద్ద  మీడియా సమావేశంలో మాట్లాడారు. 30 ఎకరాల 26 గుంటలు పట్టా భూమిని పొద్దుటూరి రాజగోపాల్ రెడ్డి నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. తాము గత మూడు సంవత్సరాల నుంచి పంట వేసుకొని కబ్జాలో ఉన్నట్లు తెలిపారు. రెండు దఫాలుగా వరి పంట సాగు చేసామన్నారు. భూమి కూడా మా పేర్ల పైనే పట్టా ఉన్నదన్నారు.అమీర్ నగర్ గ్రామ అభివృద్ధి కమిటీ సంఘ సభ్యులు ఆధ్వర్యంలో రెవెన్యూ, అటవీ అధికారులు సంయుక్త పంచనామ    నిర్వహించారన్నారు. గత ఎనిమిది నెలల క్రితం విద్యుత్ సరఫరా కోసం తాము బషీరాబాద్ ఏఈ కృష్ణ కు దరఖాస్తు, డిడి రూపంలో అందించినట్లు తెలిపారు. విద్యుత్ స్తంభాలు వేసిన తర్వాత విద్యుత్ తీగలు లాగే  సమయంలో కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో ఏఇ కృష్ణకు కమ్మర్ పల్లి తహసిల్దార్ ఫోన్ చేసి విద్యుత్ పనులను ఆపించినట్లు వాపోయారు. ఈ భూమి ఎలాంటి పరంపోగు భూమి,  అసైన్మెంట్, ఫారెస్ట్ భూమి కూడా కాదన్నారు. తాము రాజగోపాల్ రెడ్డి  దగ్గర పట్టా భూమిని కొనుగోలు చేయడం జరిగిందని,ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు.
Spread the love