ధర్నా చేస్తున్న ఇంద్రపాలనగరం రైతులు..
ధాన్యం బస్తాలను కింద పోస్తున్న క్రమంలో అడ్డుకుటున్న పోలీసులు..
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
రాజకీయ కక్షపూరిత చర్యల కారణంగానే తాము పండించిన వడ్లను అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శనివారం రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి, కలెక్టరేట్ గేటు ఎదుట ధాన్యం పారబోసి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. గత 45 రోజులుగా వడ్ల కుప్పలతో కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నా, అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని, ఒక్క గింజ కూడా జోకకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గిపోతుండడంతో రైతులు దిగాలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆందోళనలో ఉన్న రైతులు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
ఇంద్రపాలనగరంలో నెలన్నర రోజులుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండడంతో కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిల్వలు పేరుకుపోయాయన్నారు. ఒకవైపు మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాల భయం తమ్ము కలవరపెడుతుంటే.. ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదన్నారు. ఇదే తరుణంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, దళారులు కుమ్మక్కై తూకం పేరుతో తాల్తూ, తరుగు నెపంతో రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని, గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలన్న తమ ఆశలు నిరాశ అవుతున్నాయని మండిపడ్డారు. కలెక్టరేట్ ముట్టడితో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, ఐకేపీ కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ అధికారులను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అధికారులు యుద్ధప్రాతిపదికన ధాన్యం సేకరించాలని ఉదయం నుంచి సాయాత్రం వరకు కలెక్టరేట్ ముందు కుర్చున్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ ఇంద్రపాలనగరం గర్దాసు విక్రం, మాజీ వ్యవసాయ డైరెక్టర్లు మందడి విద్యాసాగర్ రెడ్డి, కర్దాస్ కరుణాకర్ , మాజీ కోఆప్షన్ మెంబర్ ఇర్లపల్లి మల్లయ్య, మాజీ ఎస్‌ఎంసి చైర్మన్ మంటి లింగస్వామి, మాజీ ఉపసర్పంచ్ గర్దాస్ వెంకటేశం, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రెసిడెంట్ రామకష్ణ. ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు నల్ల స్వామి, రైతులు రవ్వ నరసింహ. సింగన బోయిన గణేష్ ఇంద్రపాలనగరం రైతులు.


