– ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ
నవతెలంగాణ – కామారెడ్డి, మాచారెడ్డి : మాచారెడ్డి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం గురువారం మాచారెడ్డి లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన P పి ఏ సి ఎస్ చైర్మన్‌గా నౌసిలాల్ నాయక్ ప్రమాణ స్వీకారం చేయగా, పాలకవర్గ సభ్యులు కూడా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమన్నారు. రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన రుణాలు, విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ సేవలను సకాలంలో అందించడంలో పి ఏ సి ఎస్ లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ రైతు భరోసా, పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు బీమా, సాగునీటి వనరుల అభివృద్ధి వంటి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రైతులకు మార్కెట్ సదుపాయాలు, మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రైతు కుటుంబం ఆర్థికంగా బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, రైతులకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. పి ఏ సి ఎస్ లు కేవలం రుణాలు అందించే సంస్థలుగా కాకుండా రైతుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే కేంద్రాలుగా పనిచేయాలని సూచించారు.
నూతన చైర్మన్ నౌసిలాల్ నాయక్‌ను ప్రత్యేకంగా అభినందించిన షబ్బీర్ అలీ, రైతులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, రాజకీయాలకు అతీతంగా ప్రతి రైతుకు సమానంగా సేవలు అందించాలని సూచించారు. పి ఏ సి ఎస్ ను ఆర్థికంగా బలోపేతం చేసి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు నూతన పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. మాచారెడ్డి మండల రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామీణ మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సురేష్ నర్సింగరావు, మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మాచారెడ్డి సర్పంచ్ సంతోష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రెడ్డి నాయక్, భిక్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, తిప్పాపూర్ సొసైటీ చైర్మన్ భీంరెడ్డి, కామారెడ్డి సొసైటీ చైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, చుక్కాపూర్ లక్ష్మీనర్సింహ ఆలయ చైర్మన్ కమలాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, కౌన్సిలర్ మోతిలాల్, డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్, మాజీ సొసైటీ చైర్మన్లు పూల్ చంద్, స్వామిగౌడ్, రాజమౌళి, సత్యనారాయణ, బాలరాజుగౌడ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాజిరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.



