‘సుద్దాల హనుమంతు’ అనే పేరు తలవగానే మనసు లో ఓ వైబ్రేషన్ మొదలవుతుంది. అది ఒక నామవాచకం మాత్రమే కాదు. ఉద్యమ క్రియాపదం. పోరాటం ప్రతి ధ్వనించే వాక్యం. పల్లెటూరి పిల్లగాని వేదనా భరిత జీవన దృశ్యాన్ని జ్ఞప్తికి తెచ్చే పాట. అంతేకాదు నేటి కవులకు, కళాకారులకు దిశను నిర్దేశం చేసే విశేషణ ధ్వని. సుద్దాల సామాన్యుడే, కానీ ఆయన జీవన గమనం, నిర్వర్తించిన కార్యం మహోన్నతం. ప్రేరణా త్మకం. అసామాన్యం. చైతన్యయుత స్ఫూర్తి. అందుకే మళ్లీ మళ్లీ ఆ పేరును తలవాలి. జీవితాన్ని చదవాలి. ఆయన సృజ నాత్మక గీతోపదేశాల్ని పుణికిపు చ్చుకోవాలి. ఎందుకంటే అవి నేటికీ అత్యంత ఆవశ్యక మయిన చైతన్యాన్ని నింపుతూనే వున్నాయి. మనుషులకు మరణముంటుంది. కానీ వాళ్లు బతికిన కాలాలలో చేసిన ఆలోచనలు, జనం కోసం చేసిన పనులు, ఉన్నతాశయంతో నడి చిన అడుగులు, నిరంతరం వెలుగులు పంచుతూనే ఉంటాయి. అదీ ముఖ్యంగా ఒక కళా కారుని సృజన జనహృదయాలను కదిలి స్తూనే వుంటుంది. చైతన్య జ్వాలను రగిలిస్తూనే వుంటది. అనర్గళం, అనితర సాధ్యమైన మార్గాన ప్రజా శ్రేయస్సు కోసం పయనించిన హనుమంతు జీవితం సజీవ స్ఫూర్తిని అందిస్తూనే వుంటుంది. అందుకే ఈ మననం, ఈ స్మరణం.
తీగలాగితే డొంకంతా కదిలినట్టు, సుద్దాల హనుమంతు జీవితాన్ని, సాహిత్యాన్ని పరామర్శించి చూస్తే, గతంలోని ప్రజల వాస్తవిక చరిత్ర తవ్విపోసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు అలా తవ్విపోయటం మరింత అవసరమవుతున్నది. ఎందుకంటే చరిత్రను కూడా వక్రీకరిస్తూ, మనుషుల మధ్య ఆగాధాలను సృష్టిస్తున్న శక్తులు కళా సాహిత్యరంగంలోకి వచ్చి మసిపూసి మారేడుకాయ చేస్తున్న సందర్భం ఇది. వాస్తవిక చరిత్రను, ఆయన పాట ప్రతిధ్వనిస్తూనే వుంది. వక్రబుద్ధుల గుండెలపై తూటాలా పేలుతుంది. ప్రగతిశీల శక్తులందరికీ ఆయన కవిత్వం ఆయుధం లాంటిది. నేటి యువతకు మరింత పదునుపెట్టే సాధనమది. అందుకే సుద్దాల హనుమంతు జీవితాన్ని, సాహి త్యాన్ని అధ్యయనం చేయాలి. మరోమారు జనకళను, జన కవ నాన్ని సానపెట్టుకోవాలి. విచ్ఛిన్నకర శక్తుల అసత్య వాదాలను తిప్పికొట్టాలి.
చరిత్ర నిర్మాతలు ప్రజలే అన్నది నిత్యం రుజువయ్యే సత్యం. తెలంగాణ వీరోచిత సాయుధ పోరాటమూ అదే రుజువు చేసింది. తిరుగుబాటును స్పృశించేది అణచివేతనే. దోపిడీ మూలంగానే విప్లవం చెలరేగుతుంది. పీడనలోంచే ధిక్కారం పెల్లుబుకుతుంది. అందుకు నిలువెత్తు ఉదాహరణ తెలంగాణ నేల. సామాన్యులయిన మట్టి మనుషులు సాయుధులై పోరాడారు. నీ బాంచను కాల్మొక్తా అన్నవాడు, నీ గోరీ కడ్తం కొడకా! అని నినదిం చాడు. నాలుగు వేల మంది వీరులు పోరాడి ప్రాణాలను అర్పిం చారు. ఇదేదో భావోద్వేగంతోనో, మత విద్వేషం తోనో చేసింది కాదు. తన బతుక్కు ఆధారమైన భూమి కోసం, వెట్టి పీడన విముక్తి కోసం చేసింది. జమీందారులు, జాగీర్దారులూ, నైజాము పాల కులూ ప్రాణాలు తీసింది కూడా అందు కోసమే. భారతదేశ రాజకీయ, ఆర్థిక దిశను కూడా ప్రభావితం చేసిన పోరాటం ఇది. దేశంలో భూసంస్కరణలను, సామ్యవాద విధానాల నినా దాన్ని పాలక వర్గాలు సైతం తలకెత్తుకోక తప్పని పరిస్థితులను సష్టించిందీ సమరం. అంతటి మహా సమరంలో తెలంగాణ నేల మహావీరులను సృష్టించింది. చరిత్ర మరచిపోని యోధులుగా వారు నిలిచారు. వీరులేకాదు, మహాకవులూ, కళాయోధులూ ఉద్భవించారు. జానపద కళలను ప్రజాకళలుగా తీర్చి విముక్తి యుద్ధంలో స్వరాలను ఎక్కుపెట్టారు. అట్లా ప్రజా కళా సైనికునిగా జీవితాన్ని చరితాత్మకం చేసుకున్నాడు సుద్దాల హనుమంతు. అందుకే ఆయన జీవితం సార్ధకం, అమరం.
ఒక కళాత్మక హృదయం ప్రజాకళకు, ఉద్యమానికి ఎలా పరిణామం చెందుతుందో హనుమంతు జీవితం మనకు తేట తెల్లపరుస్తుంది. అతిసామాన్యులను సైతం మహా రచయిత లుగా మలచగల స్ఫూర్తి ప్రజల నుండే వస్తుంది. అతి మామూలు పోరాట యోధుడు బండి యాదగిరి ‘బండెనక బండి కట్టి…’ పాట ఇప్పటికీ మనందరినీ ఉర్రూతలూగిస్తూనే ఉండటం అందుకు ఉదాహరణ. సుద్దాల హనుమంతు అనే పేరు వినపడగానే ‘పల్లెటూరు పిల్లగాడా, పశులగాసే మొనగాడా’ పల్లవి సజీవదృశ్యమై కనుల ముందు నిలుస్తుంది కదా! అంతేకాదు, హనుమంతు పాటలను అధ్యయనం చేస్తే, ఆ సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవన చరిత్ర అంతా నిండి వుంటుంది. నైజాము పరిపాలనలో ప్రజల జీవనము, నైజాం అనంతరం కాంగ్రెసు పాలన ఏ విధంగా వున్నది, ప్రజలెన్ని అగచాట్లకు, వేదనలకు గురవుతున్నది తెలుస్తుంది. ప్రపంచం లో సామ్రాజ్యవాదం చేస్తున్న దురాక్రమణలు, దురాగతాలు కూడా విశదమవుతాయి. అంటే ఒక కవికి, కళాకారునికి స్థానిక విషయావగాహన మాత్రమే గాక ప్రపంచ పరిణా మాలపై అవగాహన అవసరమని హనుమంతు సాహిత్యం గుర్తు చేస్తుంది. ప్రపంచ దృక్పథం కలిగిన ప్రజాకళాకారుడు సుద్దాల. ‘వా వారెవా వహ్వారె రేవా…. తెలంగాణ పోరా టము / తెరచి కనులు చూచింది’ అనే పాటను రాయాలంటే ప్రపంచ గమనం ఎంత తెలిసుండాలి. ‘మహా విప్లవం సాగునులే / మహినంతట జ్వాలలు లేచునులే’ అని స్థిరంగా చెప్పగలిగిన కళాపధికుడు. ఒక పాటకు, కళారూపానికి కావల సిన వస్తువు ఎంపికకు ప్రపంచ అవగాహన ఎంత ముఖ్యమో మనం ఆయన నుండి తెలుసుకోవాలి. సాహిత్య సృజనలో ప్రజల భాషను ఎలా పట్టు కోవాలో కూడా సుద్దాల పాటల ద్వారా నేర్చు కోవచ్చు. ‘వేరు వేరు వేయర దెబ్బ, దెబ్బకు దెబ్బ వేరు వేరు’ అనే పల్లవి, సభపై దాడి చేస్తున్న రౌడీమూకను చూసి ఒక ముసలమ్మ అన్న మాటను తీసుకునే పాటను కట్టటం ప్రజా కవులకు ఓ పాఠం లాంటిది. ఉద్యమంలో ప్రతి మాటా ఓ నినాదమవుతుంది. నినాదమే పాటకు పల్లవిగా మారుతుంది. ఎన్ని విషయా లనో తన పాటకు వస్తువు చేసు కున్నాడు. పిల్లల గురించి, తల్లుల గురించి, రైతుల బాధలు, కూలివాని గోసను, మతం చిచ్చును, కుల పీడనను, సాంఘిక దురా చారాలను, దురలవాట్లను, భూస్వాముల దౌర్జన్యాలను, ఎన్నికల సమయంలో పాలకుల పన్నాగాలను, ప్రణాళికల భాగోతాన్ని, ఎర్రజెండా రెపరెపలను, ఆశయ పతాకను, అమరుల త్యాగా లను ఎన్నో ఎన్నెన్నో అతని కలం కవాతు చేస్తూ కదిలింది. ఏ ఒక్కటీ వదిలిపెట్టలేదు. అన్నిట్లోనూ ఆశయంపై ఆశను కొనసాగించాడు. సమాజంలో వున్న సహస్ర వృత్తుల సమస్త జనుల బాధలను గాధలను గానం చేశాడు. ‘వెట్టి చాకిరి విధానమోరన్నా, ఎంత జెప్పినా తీరదో కూలన్న, మాదిగన్న, మాలన్న, వడ్రంగి వడ్డెరన్న బేగరన్న, కుమ్మరన్న, కమ్మరన్న, కూలన్న, రైతన్న, చాకలన్న వెట్టిచేత చాలగలదురోరన్న ! వేకువనే లేవాలి వాకిలూకి చల్లాలి / మేడంతా కడగాలి / తడినంతా తుడవాలి’ అంటూ వెట్టి పనులన్నీ ఏకరువు పెడతాడు. సుద్దాల పాటలు చదవండి, ఎంత దోపిడి ఎలా జరిగిందో తెలుస్తుంది. అంతేకాదు సాధు వేషధారణలో తత్వగీతాలను ప్రజా సమస్యల కలబోతగా మలిచిన తీరు, ప్రజా కళాకారులకు, రచయితలకు ఉపయోగ పడుతుంది. గొల్ల సుద్దులు కళారూపాన్ని తీసుకుని తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను ఎంతో సరళంగా వివరిస్తారు. నైజము కుటల్రను, కాంగ్రెస్ అసలు రూపాన్ని అన్నీ పల్లె పదాలలో నింపి విని పించడం చూడ గలము. పోరాట చరిత్రను, సంఘటనలను ప్రేరణాత్మకంగా కళ్లకుగట్టడం సుద్దాల ప్రతిభకు, నిబద్ధతకు నిదర్శనం. అంటే పీడితుల పక్షాన నిలబడి రాసే కవికి ఉండాల్సిన ఎరుక, పరిజ్ఞానం, అవగాహన సుద్దాల నుండి మనం నేర్చుకోవాలి. ఇక యక్షగానం ప్రక్రియను ఎంచుకుని శ్రీలక్ష్మిని వేడుకుం టూనే భూస్వాముల ఆగడాలను వివరించి, వారి నుండి కాపాడమని వేడు కోవడం చూస్తే, ప్రజలలోకి ప్రజా కళాకారుడు ఎలా పోవాలో అర్థమవుతుంది.
తెలంగాణ సాయుధ పోరాటకాలంలోనే కాదు. పోలీస్ యాక్షన్ తర్వాత, కాంగ్రెసు ప్రభుత్వం ఎవరి పక్షం వహించిందో స్పష్టంగా తెలిసిన హనుమంతు అప్పుడు కూడా ప్రజలు పడు తున్న బాధలపై పాటలు కట్టాడు. ‘మంటలు మంటలు దేశ మంతట ఆకలి మంటలు, ఇంకెన్నాళో ఈ నరకం / ఇంకెం దులకీ చెలగాటం’ అన్న పాదం చదివితే పాలకులు వ్యా పార వర్గాలకు ఎలా మేలు చేశారో విశదమవుతుంది. ఇక ‘జై యనరా జైజై అనరా! అరుణ పతాకకు జై జై అనరా!’ అన్న ఆత్మ విశ్వాసాన్ని నిండుగా గల కవి సుద్దాల. అటు జానపద బాణీలను, పల్లె పదాలను అనుసరిస్తూ ప్రజా ఉద్యమానికి నూతనోత్తేజాన్ని అందిస్తూ, గేయ నడకలో కొత్తగా వస్తున్న లయాత్మక కవనరీతినీ పట్టుకుని పాటలల్లాడు. ”ప్రజా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం /ప్రజా ప్రభుత్వం సాధిస్తాం / నిజాములో ప్రతి బజారులో మా ధ్వజం ఎర్రనిది ఎగరేస్తాం” పాట శ్రీశ్రీ మరో ప్రపంచం మరో ప్రపంచం గేయాన్ని గుర్తు కు తెస్తుంది. తన రచనా నైపుణ్యాన్ని ప్రతి పాదంలోనూ ప్రజా దృక్పథం వీడకుండా సాగిపోతుంది. సామాజిక అధ్యయనం, ఉద్యమంలో భాగస్వామ్యం, నిబద్ధ రాజకీయ అవగాహన, కవన నైపుణ్యం అన్నీ కలిపిన ప్రజాయుద్ధ కళాగొంతు మన సుద్దాల హనుమంతు. ఆనాటి ప్రజాకళాకారులు, సాహితీకా రులు ప్రజా రాజకీయాలలో ఉద్యమాలలో భాగస్వాములుగానే వున్నారు. సుద్దాల కూడా ధైర్యంగా ముందు నిలిచాడు. అరణ్యవాసమూ, అజ్ఞాతవాసమూ అనుభవించాడు. గుండెనిండా ఆశయం, కళాతపన నిండుగా వున్న సంపద్వంతుడు. ఒక్క ‘పాల బుగ్గల జీతగాడా’… పాటను పరిశీలిస్తే చాలు ఎంత గొప్ప కవో అర్ధమవుతుంది. భావి పౌరుల దు:ఖమయ జీవనాన్ని అక్షరా ల్లోకి వంచిన పాటది. కేవలం జీవ నాన్ని వెల్లడించడమే కాదు. ”కష్టజీవుల కడుపునిండ / కనికరించే ఎర్రజెండ /ఎర్ర కోటపై ఎగరాలంటావా ఓ పాల బుగ్గల జీతగాడా… దోపిడీ దొరల రాజ్యం పోవాలంటావా/’ అని ముగించడంలో చిగురించే ఆశను సూచిస్తాడు. అదీ హనుమంతు ఆశయం. నేటి ప్రజా కళాకారులకు, కవులకు ఆయన సాహిత్యం ఒక దిక్సూచి. తెలంగాణ నేలలో అనేక మంది ప్రజాకళాకారులకు ఆయన మార్గదర్శి. ఒక స్ఫూర్తి, ప్రేరణ, నింపుకునే చైతన్యం.
కె. ఆనందాచారి, 9948787660
( నేడు సుద్దాల హనుమంతు 41వ వర్థంతి )