ఎట్టకేలకు ఎజెండా

Finally the agenda– నాలుగు బిల్లులు.. 75 ఏండ్ల పార్లమెంట్‌ ప్రస్థానంపై చర్చ..
– ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై లీకులు

కేంద్రప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలను ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ సమావేశాల ఎజెండా ఏమిటో వెల్లడించకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌ సమావేశాల ఎజెండా వెల్లడించింది. ప్రత్యేక సెషన్‌లో ప్రభుత్వం ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనను తీసుకురావచ్చని , దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మారుస్తుందని ఊహాగానాలు వచ్చాయి. ప్రభుత్వం విడుదల చేసిన ఎజెండాలో వాటి ప్రస్తావన లేదు. కానీ గతంలో కూడా ఎజెండాలోలేని అంశాలను సంఖ్యాబలంతో ఆమోదించుకున్న విషయం విదితమే. ఇపుడు కూడా అలాగే మోడీ ప్రభుత్వం వ్యవహరించనున్నట్టు లీకులు వస్తున్నాయి.
న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ప్రతిపాదిత ఎజెండాను కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. బుధవారం ప్రకటించిన సమాచారం ప్రకారం.. సమావేశాల మొదటి రోజున 75 ఏండ్ల పార్లమెంటు సమావేశాలు నడిచిన తీరు గురించి ఉభయ సభల్లోనూ చర్చిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిషత్‌ నుంచి నేటి వరకు పార్లమెంటరీ ప్రస్థానంపై చర్చించనున్నారు. ఈ సెషన్‌లో ఉభయ సభల్లో నాలుగు బిల్లులు కూడా ప్రవేశపెట్టనున్నారు. కాగా పాత పార్లమెంట్‌ భవనంలో సమావేశాలు ప్రారంభమవుతాయని, మరుసటి రోజు కొత్త భవనానికి మారుతుందని అధికారులు తెలిపారు.
సెప్టెంబర్‌ 19న గణేశ్‌ చతుర్థి కావటంతో కొత్త పార్లమెంట్‌ హౌస్‌కి మారడం శుభప్రదంగా ఉంటోందని బీజేపీ చెబుతోంది. అయితే కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ ప్రభుత్వ ప్రత్యేక సెషన్‌ ఎజెండాపై పలు విమర్శల
చేశారు. పార్లమెంట్‌ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా 2021లోనే పలు కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. మళ్లీ పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ఇదే అంశంపై చర్చిస్తారని ప్రభుత్వం ప్రకటన చెబుతోందని, మూడేండ్లలో ఒకే సందర్భాన్ని రెండుసార్లు చర్చించడంలోనే అంత్యర్యమేమిటో ప్రభుత్వానికే తెలియాలని విమర్శంచారు. లేదంటే ఇది మరో రాజకీయ వ్యూహమా? అనేది అనుమానంగా ఉందని అందోళన వక్తం చేశారు. ఇటీవల ప్రతిపక్షం కూడా ప్రత్యేక సెషన్‌ కోసం తన ఎజెండాను ప్రకటించిన సంగతి తెలిసిందే. సోనియాగాంధీ ప్రభుత్వానికి జారీ చేసిన లేఖలో 9 అంశాలను ప్రస్తావించారు. వీటిలో అదానీ కేసులో జేపీసీ డిమాండ్‌ కూడా ఉంది. దీంతో పాటు పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
17న అఖిలపక్షం
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ప్రారంభానికి ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్‌ 17న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని పిలిచింది. సాయంత్రం 4.30 గంటలకు అన్ని పార్టీలకు చెందిన సభా నాయకులతో సమావేశం జరుగుతుందని, సమావేశానికి హాజరుకావాలని ప్రతిపక్ష పార్టీల నేతలందరికీ ఈ-మెయిల్‌ ద్వారా ఆహ్వానాలు పంపించామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను ఆగస్టు 31న ప్రహ్లాద్‌ జోషి ప్రకటించారు.
బిల్లులు ఇవే…
ఈనెల 18న ప్రారంభమయ్యే సమావేశాలపై లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు వేర్వేరుగా బులెటిన్లు విడుదల చేశాయి. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించేలా కేంద్రప్రభుత్వం కొత్త బిల్లు ను ఆగస్టు 10న రాజ్యసభ లో ప్రవేశపెట్టింది. నియామక ప్యానెల్‌లో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్‌ చేసిన కేంద్ర క్యాబినెట్‌ మంత్రి ఒకరు సభ్యులుగా ఉంటారని బిల్లులో పేర్కొన్నారు. కమిటీ నుంచి సీజేఐను తొలగించనున్నట్లు చెప్పడంతో ఈ నియామక ప్రక్రియ వివాదాస్పదమైంది.ఈ బిల్లుతో కలిపి నాలుగు ముఖ్యమైన బిల్లులను ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ద అడ్వకేట్స్‌ (సవరణ) బిల్లు, ద ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్లుల గురించి చర్చిస్తారని సమాచారం. వీటిని ఆగస్టు 3న రాజ్యసభలో ఆమోదించారు. మరోవైపు ద పోస్టాఫీసు బిల్లు-2023పై చర్చకు రాజ్యసభ ఎంపీలు సన్నద్ధమయ్యారు. ఉమ్మడి పౌరస్మృతిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Spread the love