బాధిత జర్నలిస్టుకు ఆర్థిక సహకారం

– విరాహత్ అలీ చేతుల మీదుగా సహాయం..
నవతెలంగాణ – డిచ్ పల్లి
డయాబేటిక్ ప్రభావంతో కాలు కోల్పోయిన ఓ పేద జర్నలిస్టుకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) నిజామాబాద్ జిల్లా శాఖ అండగా నిలిచి, లక్షా యాభై వేల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించి, మానవత్వాన్ని చాటుకొని ఆదర్శంగా నిలిచింది. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి కేంద్రంగా, దాదాపు 30ఏళ్ళ పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, నమస్తే తెలంగాణా తోపాటు ఇతర దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన రామకోటి వెంకట్, ఆర్థిక పరిస్థితులు బాగులేక బ్రతుకు దెరువు కోసం హైదరాబాద్ కు వలస వెళ్ళాడు. బోరబండ, గాయత్రీ నగర్ లోని ఓ ఆలయంలో పూజారిగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మూడు నెలల క్రితం హఠాత్తుగా షుగర్ లెవెల్స్ పెరిగిపోయి రెండు కాళ్ళు ఇన్ఫెక్షన్ కు గురయ్యాయి. చికిత్స సాధ్యం కాకపోవడంతో కూడికాలును తొలగించేసారు. ఇంకో కాలుకు కూడా ప్రమాదం పొంచి ఉందని వైద్యులు తేల్చి చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న టీయుడబ్ల్యూజే నిజామాబాద్ జిల్లా శాఖ, తమ శ్రేయోభిలాషుల నుండి లక్షా యాభై వేల రూపాయల విరాళాన్ని సేకరించి, శుక్రవారం  నాడు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ చేతులమీదుగా బాధితుడు రామకోటి వెంకట్ కు ఆర్థిక సహకారాన్ని అందించింది. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎడ్ల సంజీవ్, అరవింద్ బాలాజీల నేతృత్వంలో జరిగిన ఈ సహాయ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సిరిగాద ప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవ్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జి. ప్రమోద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love