– 45 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
భానుడి ప్రతాపంతో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర ఉక్కపోత ఉండటంతో వాతావరణ శాఖ చెబుతున్నదానికంటే ఒకటెండ్రు డిగ్రీల ఎండ ఎక్కువే ఉన్న భావన కలుగుతున్నది. సోమవారం నాడు నల్లగొండ జిల్లా దామరచర్లలో అత్యధికంగా 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాబోయే ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే రీతిలో ఉంటాయనీ, కొన్ని ప్రాంతాల్లో రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రత 45 డిగీల్రు దాటడంతో మధ్యాహ్నం పూట వేడిగాల్పులు వీస్తున్నాయి. వీటి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశముంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాల్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే గానీ పనుల మీద బయటకు వెళ్లొద్దనీ, చిన్నపిల్లలు, వృద్ధులు విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు తీవ్ర ఉక్కపోతతో వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఓ కానిస్టేబుల్ వడదెబ్బతో చనిపోయారు.