ఇక ఐదు టెస్టుల సమరం

ఇక ఐదు టెస్టుల సమరం– బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల
మెల్‌బోర్న్‌ : ప్రతిష్టాత్మక భారత్‌, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ ఇక నుంచి ఐదు మ్యాచుల పోరాటంగా ఉండనుంది. ఇప్పటివరకు యాషెస్‌, పటౌడీ ట్రోఫీ (భారత్‌,ఇంగ్లాండ్‌) టెస్టు సిరీస్‌ల్లోనే ఐదు మ్యాచులు జరుగుతున్నాయి. ఇక నుంచి బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో ఐదు టెస్టులు ఉండనున్నాయి. ఈ మేరకు భారత్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డులు సంయుక్త నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది నవంబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. నవంబర్‌-జనవరి వరకు బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ కోసం పోటీపడుతుంది. ఈమేరకు ఆస్ట్రేలియా అంతర్జాతీయ షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించింది. భారత్‌, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ సంప్రదాయ తొలి టెస్టు వేదిక బ్రిస్బేన్‌ స్థానంలో పెర్త్‌ వచ్చింది. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో తొలి టెస్టుకు గబ్బా ఆతిథ్యం ఇవ్వటం ఆనాయితీ. కానీ ఈ సారి అందుకు భిన్నంగా పెర్త్‌ స్టేడియం వేదిక కానుంది. రెండో టెస్టు, డే నైట్‌ పింక్‌ బాల్‌ టెస్టు ఆడిలైడ్‌లోనే షెడ్యూల్‌ చేశారు. బాక్సింగ్‌ డే టెస్టుకు మెల్‌బోర్న్‌, న్యూ ఇయర్‌ టెస్టుకు సిడ్నీ వేదిక కానున్నాయి. నవంబర్‌ 22-26న పెర్త్‌లో తొలి టెస్టు, డిసెంబర్‌ 6-10న ఆడిలైడ్‌లో డే నైట్‌ టెస్టు, డిసెంబర్‌ 26-30న మెల్‌బోర్న్‌లో బాక్సింగ్‌ డే టెస్టు, జనవరి 3-7న సిడ్నీలో న్యూ ఇయర్‌ టెస్టు జరుగుతాయి. ఆస్ట్రేలియా పర్యటనలో గత రెండు సార్లు భారత జట్టు బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇప్పుడు 2024లోనూ బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌ను దక్కించుకుంటే కంగారూ గడ్డపై అరుదైన హ్యాట్రిక్‌ టెస్టు సిరీస్‌ విజయం సాధించిన జట్టుగా టీమ్‌ ఇండియా నిలువనుంది.

Spread the love