దూబె ధనాధన్‌

దూబె ధనాధన్‌– రాణించిన రచిన్‌, గైక్వాడ్‌
– చెన్నై సూపర్‌కింగ్స్‌ 206/6
నవతెలంగాణ-చెన్నై : సూపర్‌ కింగ్స్‌ యువ బ్యాటర్లు దంచి కొట్టారు. ఓపెనర్లు రచిన్‌ రవీంద్ర (46, 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (46, 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), శివం దూబె (51, 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో కదం తొక్కారు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రచిన్‌, రుతురాజ్‌, దూబె త్రయం మెరువటంతో చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఎం.ఎస్‌ ధోని సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ (2/49) రెండు వికెట్లు పడగొట్టాడు.
ఆ ముగ్గురు మెరువగా..
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన సూపర్‌కింగ్స్‌కు రచిన్‌ రవీంద్ర (46) ధనాధన్‌ ఆరంభం అందించాడు. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. రుతురాజ్‌ నెమ్మదిగా ఆడినా.. రచిన్‌ దంచికొట్టాడు. మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో టైటాన్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రచిన్‌ నిష్క్రమణ తర్వాత జోరందుకున్న రుతురాజ్‌.. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిశాడు. ఓపెనర్లు ఇద్దరూ అర్థ సెంచరీ ముంగిట వికెట్‌ కోల్పోయారు. అజింక్య రహానె (12) నిరాశపరచగా.. శివం దూబె (51) చిచ్చరపిడుగులా చెలరేగాడు. ఎదుర్కొన్న తొలి రెండు బంతులనే సిక్సర్లుగా మలిచిన దూబె సూపర్‌కింగ్స్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాడు. డార్లీ మిచెల్‌ (24) సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడగా.. సమీర్‌ రిజ్వీ (14, 6 బంతుల్లో 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. రషీద్‌ ఖాన్‌ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన రిజ్వీ.. ఐపీఎల్‌లో తొలి ఇన్నింగ్స్‌లోనే దూకుడుకు టీజర్‌ చూపించాడు. యువ బ్యాటర్లు సమిష్టిగా మెరవటంతో చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగుల భారీ స్కోరు చేసింది. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ రెండు వికెట్లు పడగొట్టగా..సాయి కిశోర్‌, స్పెన్సర్‌ జాన్సన్‌, మోహిత్‌ శర్మలు తలో వికెట్‌ తీసుకున్నారు.

Spread the love