జెకెసిఎ అధికారిపై ఎఫ్‌ఐఆర్‌

– ఏజ్‌ ఫ్రాడ్‌ వివాదంపై కేసు నమోదు
న్యూఢిల్లీ : జమ్ము అండ్‌ కాశ్మీర్‌ ఆర్థిక నేరాల పోలీసు విభాగం జమ్ము కాశ్మీర్‌ క్రికెట్‌ సంఘం (జెకెసిఎ) ఇన్‌చార్జ్‌ మజిద్‌ దార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మజిద్‌ దార్‌ 2000-2013 సమయంలో జమ్ము కాశ్మీర్‌ జట్టుకు 37 ఫస్ట్‌ క్లాస్‌, 17 లిస్ట్‌-ఏ, ఐదు టీ20లు ఆడాడు. ఈ సమయంలో వయసుపై దార్‌ తప్పుడు ధృవ పత్రాలను సమర్పించాడని జెకెసిఎ మాజీ సీఈవో పోలీసులకు 2021లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన ఆర్థిక నేరాల విభాగం.. దార్‌ వయో మోసానికి పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని అతడిపై ఐపిసి 420, 467, 471 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. జమ్ము కాశ్మీర్‌ క్రికెట్‌ వ్యవహారాలను చూసేందుకు బీసీసీఐ ముగ్గురు సభ్యుల కమిటీని నియమించగా.. ఆ కమిటీకి మజిద్‌ దార్‌ ప్రస్తుతం రిపోర్టు చేస్తున్నారు. మజిద్‌ దార్‌పై కేసు నమోదును జెకెసిఎ త్రిసభ్య కమిటీ చీఫ్‌ అనిల్‌ గుప్త ‘ప్రతీకార చర్య’గా అభివర్ణించారు. జమ్ము కాశ్మీర్‌ క్రికెట్‌లో అవినీతిని మజిద్‌ దార్‌ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ‘ రంజీ క్రికెట్‌లో ఆడేందుకు ఎటువంటి వయో పరిమితి లేదు. రంజీ మ్యాచులు ఆడేందుకు తప్పుడు ధ్రవ పత్రాలు సృష్టించాల్సిన అవసరం లేదు. ఇక మజిద్‌ దార్‌ తల్లిదండ్రులు 1973లో వివాహం చేసుకున్నారు. పోలీసులకు మజిద్‌ దార్‌ 1970లోనే జన్మించారని ఫిర్యాదు చేశారు. మజిద్‌ను వేధింపులకు గురి చేసేందుకు ఇదో ప్రయత్నమని తెలుస్తుంది’ అని గుప్త తెలిపారు. మజిద్‌ దార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అంశంలో బీసీసీఐ స్పందించాల్సి ఉంది. త్రి సభ్య కమిటీ పూర్తి వివరాలు బోర్డుకు తెలియజేయనుంది.

Spread the love