బోణీ కొట్టేదెవరు?

Who will beat Boni?– తొలి విజయంపై ఇరు జట్ల గురి
– సన్‌రైజర్స్‌తో ముంబయి ఢీ నేడు
– ఐపీఎల్‌కు ఉప్పల్‌ స్టేడియం ముస్తాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌.. ఐపీఎల్‌ 2024లో కొత్త సారథులతో ప్రయోగం. సారథ్య పరీక్షలో తొలి మ్యాచ్‌లోనే హార్దిక్‌ పాండ్య అనూహ్య పరాజయం చవిచూడగా.. పాట్‌ కమిన్స్‌ గెలుపు ముంగిట నిరాశపరిచాడు. హార్దిక్‌ పాండ్యకు సారథ్య పగ్గాలతో ముంబయి ఇండియన్స్‌ అభిమానుల్లో అలజడి, పెద్ద ఎత్తున వ్యతిరేకత ఆ జట్టుకు మైదానంలో ప్రతికూలంగా మారుతుంది. మరోవైపు ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులు పాట్‌ కమిన్స్‌ను సొంతం చేసుకోవటం సన్‌రైజర్స్‌కు అతిపెద్ద ఊరట. డెవిడ్‌ వార్నర్‌ వివాదాస్పద నిష్క్రమణ తర్వాత సన్‌రైజర్స్‌ యాజమాన్యంపై అభిమానుల వ్యతిరేతక ఇప్పుడిప్పుడే తగ్గుతోంది!. తాజా సీజన్‌లో తొలి విజయం కోసం హైదరాబాద్‌, ముంబయి నేడు ఢీకొీట్టనున్నాయి.
స్వదేశీ కలిసొస్తేనే..
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీజన్‌లో మెరుగైన ఫలితాలు సాధించేలా కనిపిస్తుంది. జట్టు కూర్పు సైతం ఆశాజనంగా ఉంది. కానీ స్వదేశీ ఆటగాళ్ల పేలవ ప్రదర్శన ప్రతికూలంగా మారే ప్రమాదం పొంచి ఉంది. బ్యాటింగ్‌ లైనప్‌లో భారత క్రికెటర్లు మళ్లీ భారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మయాంక్‌ అగర్వాల్‌, అభిషేక్‌ శర్మ, అబ్దుల్‌ సమద్‌లు అంచనాలను అందుకోవటం లేదు. విదేశీ ఆటగాళ్లపై పూర్తి భారం వేయటంతో ఒత్తిడి పెరుగుతోంది. ఎడెన్‌ మార్క్‌రామ్‌ స్థానంలో ట్రావిశ్‌ హెడ్‌ తుది జట్టులోకి వస్తే బ్యాటింగ్‌ లైనప్‌ కాస్త బలోపేతం కావచ్చు. హెన్రిచ్‌ క్లాసెన్‌ గత మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో అభిమానుల హృదయాల్లో చోటు సాధించాడు. సొంతగడ్డపై నేడు క్లాసెన్‌ నుంచి అభిమానుల మరో విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు. మార్కో జాన్సెన్‌, పాట్‌ కమిన్స్‌లకు నటరాజన్‌, భువనేశ్వర్‌ చక్కగా సహకరిస్తున్నారు. భువనేశ్వర్‌ తొలి మ్యాచ్‌లో నిరాశపరిచినా.. స్వింగ్‌స్టర్‌ లయ అందుకునేందుకు పెద్ద సమయం పట్టకపోవచ్చు. షాబాబ్‌ అహ్మద్‌, మయాంక్‌ మార్కండేలు మరోసారి స్పిన్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. గత సీజన్‌తో కలిపి వరుసగా ఐదో విజయం సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీజన్‌ ఆరంభంలోనే గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తుది జట్టు ఎంపికలో విదేశీ ఆటగాళ్ల సందిగ్థత ఈ మ్యాచ్‌లోనూ కొనసాగుతుంది. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సహజంగానే తుది జట్టులో నిలుస్తాడు. గత మ్యాచ్‌లో ఇద్దరు బ్యాటర్లు, ఇద్దరు బౌలర్లను ఎంచుకున్నారు. సన్‌రైజర్స్‌కు ప్రధానంగా బ్యాటింగ్‌ విభాగంలో సమస్యలు ఉన్నాయి. దీంతో ముగ్గురు విదేశీ బ్యాటర్లను ఎంచుకునే అవకాశం సైతం లేకపోలేదు.
హార్దిక్‌కు సవాల్‌
హార్దిక్‌ పాండ్యకు సరికొత్త సవాల్‌. రోహిత్‌ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ను అభిమానులు అంగీకరించటం లేదు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఫీల్డింగ్‌ పొజిషన్లను హార్దిక్‌ తరచుగా మార్చటం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దీనిపై సోషల్‌ మీడియాలోనూ అభిమానులు విమర్శలు గుప్పించారు. ఓ వైపు అభిమానుల మన్నన పొందటంతో పాటు మరోవైపు జట్టును గెలుపు పథాన నడిపించటం హార్దిక్‌ పాండ్యకు కత్తి మీద సాముగా మారింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ముంబయి ఇండియన్స్‌కు మంచి రికార్డుంది. గత ఐదు మ్యాచుల్లో ముంబయి నాలుగింట గెలుపొందింది. గత సీజన్‌లో రెండు మ్యాచుల్లో ముంబయి ఇండియన్స్‌దే పైచేయి. లోకల్‌ బారు తిలక్‌ వర్మపై నేటి మ్యాచ్‌లో ఫోకస్‌ ఉండనుంది. ముంబయి ఇండియన్స్‌ శిబిరంలో కీలక ఆటగాడిగా ఎదిగిన తిలక్‌ వర్మ మిడిల్‌ ఆర్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ స్థానం భర్తీ చేయటంపై దృష్టి సారిస్తున్నాడు. ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మలు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ముంబయి ఇండియన్స్‌ గట్టి పోటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రాను ఎదుర్కొవటం సన్‌రైజర్స్‌ బ్యాటర్లకు సవాల్‌గా మారనుంది.
టికెట్లు హాట్‌కేక్‌లు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌ మ్యాచ్‌కు టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. కనీస టికెట్‌ ధర రూ.1500గా నిర్ణయించినా అభిమానులు ఆన్‌లైన్‌లో టికెట్ల కోసం పోటీపడ్డారు. నేటి మ్యాచ్‌కు స్టేడియం పూర్తి సామర్థ్యం మేరకు టికెట్లు అమ్ముడుపోయినట్లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాంఛైజీ వర్గాలు తెలిపాయి. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంత మైదానం ఉప్పల్‌ స్టేడియం.. ఆరెంజ్‌ ఫ్లాగ్‌లతో ముస్తాబైంది. టీమ్‌ ఈగల్స్‌కు మద్దతుగా ఈ సీజన్‌లో ఫ్యాన్స్‌ స్టాండ్స్‌లో ఆరెంజ్‌ ఆర్మీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.

Spread the love