విమాన రంగంపై ఒత్తిడి పెరుగుతోంది.. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడొద్దు : అమెరికా వాణిజ్య శాఖ వెల్లడి
సుంకాల విధింపుపై ట్రంప్ ప్రభుత్వ విముఖత
వాషింగ్టన్ : దిగుమతి చేసుకున్న వాణిజ్య విమానాలు, జెట్ ఇంజిన్లు, విడిభాగాలపై అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తు పూర్తి చేసింది. విదేశీ వస్తువులు అమెరికా జాతీయ భద్రతకు ఆందోళన కలిగిస్తున్నాయని తమ దర్యాప్తులో తేలిందని తెలిపింది. అయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం వాటి దిగుమతులపై కొత్తగా సుంకాలు విధించలేదు. గత సంవత్సరం ప్రభుత్వం విమానయాన రంగంపై స్వల్పంగా సుంకాలు విధించింది. ఆయితే అనంతరం సుంకాల రద్దు కోసం ఆ రంగం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేయింది. దీంతో వాణిజ్య భాగస్వాములతో కుదుర్చుకున్న ఒప్పందాలలో భాగంగా విమానాలు, విడిభాగాల దిగుమతులపై సుంకాలను ఎత్తివేయడానికి ట్రంప్ ప్రభుత్వం అంగీకరించింది.
విదేశీ సరఫరాలపై ఆధారపడుతున్న
విమాన పరిశ్రమ
విదేశీ వస్తువుల దిగుమతులపై వాణిజ్య శాఖ గత సంవత్సరం దర్యాప్తును ప్రారంభించింది. దీని ఆధారంగా గురువారం నివేదిక విడుదలైంది. అమెరికా విమాన పరిశ్రమ విదేశీ సరఫరాలపై ఎక్కువగా ఆధారపడుతోందని, ఇది జాతీయ భద్రతపై ఆందోళనలను పెంచుతోందని ఆ నివేదిక తెలిపింది. నాణ్యతా నియంత్రణ సరిగా లేకపోవడం, నకిలీల బెడద కారణంగా దిగుమతి చేసుకుంటున్న విమాన విడిభాగాలతో ముప్పు ఏర్పడుతుందని వివరించింది. అయినప్పటికీ తక్షణ సుంకాలు విధించవద్దని వాణిజ్య మంత్రి హొవర్డ్ లుత్నిక్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారని అధ్యక్షభవనం తెలిపింది.
చౌక దిగుమతులతో ఒత్తిడి
అమెరికా వాణిజ్య ఏరోస్పేస్ పరిశ్రమపై విదేశీ దిగుమతులు చూపే ప్రభావాన్ని నివారించేందుకు వాణిజ్య భాగస్వాములతో చర్చలు జరపాలని ట్రంప్ ఆదేశించారు. వాణిజ్య ఒప్పందాలు కుదరక పోయినా ఆరు నెలలలో చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు. ‘చౌకగా వస్తువులను అందిస్తున్న విదేశీ సరఫరాదారుల నుంచి తీవ్రమైన పోటీ ఉంటోంది. ఈ ఒత్తిడి కారణంగా దేశీయ సంస్థలు వేతనాలను నిలిపివేస్తున్నాయి. నియామకాలను పరిమితం చేస్తున్నాయి. దీంతో ఇతర పరిశ్రమలతో పోలిస్తే విమానాల ఉత్పత్తి రంగంలోని ఉద్యోగాలు అంతగా ఆకర్షణీయంగా ఉండడం లేదు’ అని నివేదిక వివరించింది. 1979వ సంవత్సరపు పౌర విమాన ఒప్పందం ప్రకారం విమానాలు, వాటి విడిభాగాలపై సుంకాలు విధించడం లేదు. దీంతో ఏటా 75 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు కన్పిస్తోంది.
బోయింగ్ అమ్మకాలపై ట్రంప్ గొప్పలు
బోయింగ్ విమానాల అమ్మకాలను ట్రంప్ వాణిజ్య ఒప్పందాలలో కీలక భాగంగా మార్చారు. విదేశాలకు విమానాల అమ్మకంలో సాయపడ్డానంటూ గొప్పలు చెప్పారు. విమాన సుంకాల ప్రభావం టిక్కెట్ ధరలు, విమానయాన భద్రత, సరఫరాలపై పడుతుందని డెల్టా ఎయిర్‌లైన్స్, ప్రధాన వాణిజ్య బృందాలు గత సంవత్సరమే హెచ్చరించాయి. సుంకాలతో అమెరికాలో విమానాల ఉత్పత్తి ప్రమాదంలో పడుతుందని ఎయిర్‌బస్ అమెరికాస్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.


