నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణ నూతన ఆటో యూనియన్ బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా కూతాడి ఎల్లయ్య, పట్టణ కమిటీ కార్యదర్శిగా పోగులు నగేష్ గౌడ్, సహాయ కార్యదర్శిగా అరికెపల్లి నరేష్, కోశాధికారిగా ఒంటెద్దు చిన్న, కమిటీ సభ్యులుగా కావేటి అనిల్ కుమార్, అబ్దుల్ వహాబ్, కామిని, నవీన్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి కార్మికుల పొట్ట కొట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తే ఇప్పటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆటో కార్మికులందరికీ సంవత్సరానికి రూ.12,000/- జీవనభృతి ఇస్తానన్న హామీ అటకెక్కిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలల్లో ఒక్క ఆటోకు సంవత్సరానికి రూ.16 వేలు ఉన్న ఇన్సూరెన్స్ రూ.8000/- చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఇండ్లు లేని కార్మికులందరికీ డబల్ బెడ్ రూములు ఇస్తానని, ఎలక్ట్రికల్ ఆటోను తీసుకొచ్చి బస్టాండ్ లో నుంచి ప్రయాణికులను ఇంటి వద్దకు చేరుస్తానని, పాత ఆటో డ్రైవర్లను డ్రైవర్లు గా నియమించి, వారికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల10 న జరిగే ” జైల్ బారో ” కార్యక్రమాన్ని ఆటో కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, ఆశాలు, ఆయాలు, గ్రామపంచాయతీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ కూలీలు, పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.



