ప్రయివేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్న మాజీ సీఎం

నవతెలంగాణ – అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన భద్రత కోసం ప్రయివేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమించుకున్న సుమారు 30 మంది సిబ్బంది సోమవారం తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తొలుత ఒకేసారి అంతమంది సఫారీ సూట్లలో భరతమాత విగ్రహం కూడలి వద్ద నిలబడటంతో హడావుడి నెలకొంది. వారికి అనుమతి వచ్చిన తర్వాత క్యాంపు కార్యాలయంలోకి వెళ్లారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, పాదయాత్ర సమయంలో ప్రయివేటు భద్రతా సిబ్బందిని పెద్ద సంఖ్యలో జగన్‌ నియమించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి జగన్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి స్థాయిలోనే భద్రతను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మాజీ అవడంతో పాటు, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆయన పార్టీకి దక్కలేదు. ఇకపై జగన్‌ ఓ మాజీ ముఖ్యమంత్రిగా, సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగానే ఆయన భద్రతలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా ప్రయివేటు సిబ్బందిని జగన్‌ సిద్ధం చేసుకున్నారు.

Spread the love