పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

నవతెలంగాణ-మిర్యాలగూడ
పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి చైతన్యపరచాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో నియోజవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తుందని, అందులో భాగంగానే ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై భారాలను మోపుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఒక వేదిపైకి వచ్చి బీజేపీని గద్దె దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. దీనికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. కర్నాటక ఫలితాలు, కాంగ్రెస్‌లో పొంగులేటి చేరికతో తెలంగాణలో కాంగ్రెస్‌కు కొంత ఊపు తీసుకొచ్చిందన్నారు. దీంతో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌- కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని, కానీ వరంగల్‌లో మోడీ సభతో తాము కూడా పోటీలో ఉన్నట్టు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వొద్దన్నారు. ప్రజా సమస్యల కోసం పోరాటాలు నిర్వహించే వామపక్ష పార్టీలకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని, వాటి అమలు కోసం భవిష్యత్‌లో ప్రజా ఉద్యమాలు చేస్తామని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికులుగా పనిచేసి గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేశ్‌, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్‌, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్‌ మల్లు గౌతమ్‌రెడ్డి, తిరుపతి, రామ్మూర్తి, భావండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, రెమిడాల పరుశరాములు, ఐద్వా జిల్లా అధ్యక్షులు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Spread the love