సియోల్ : దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ కు సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2024లో మార్షల్ లా ( సైనిక పాలన ) ప్రకటన పేరుతో ఉత్తర కొరియాపై డ్రోన్లను ప్రయోగించేందుకు యూన్ సుక్-యోల్ కుట్ర పన్నారని కోర్టు వ్యాఖ్యానించింది. దక్షిణ కొరియాపై సాయుధ లేదా సైనిక చర్యలు చేపట్టేలా ఉత్తర కొరియాను రెచ్చగొట్టడమే యూన్ ఉద్దేశ్యమని జడ్జీలు పేర్కొ న్నారు. 2024లో మార్షల్ ప్రకటనకు రెండు నెలల ముందు ఉత్తర కొరియాపై డ్రోన్ దాడికి పాల్పడ్డారు. ప్రచార కరపత్రాలను కూడా జారవిడిచినట్లు ఉత్తర కొరియా ఆరోపించింది. ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు పెంచి, జాతీయ సంక్షోభాన్ని సృష్టించాలని యూన్ కుట్ర పన్నారని, దీంతో తన మార్షల్ లా ప్రకటనను సమర్థించుకునేందుకు యత్నించారని పేర్కొన్నారు. డ్రోన్ దాడి ఘటనకు సంబంధించి యూన్ కు 30 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు సియోల్ సెంట్రల్ డిస్ర్టిక్ట్ కోర్ట్ ప్రతినిధి శుక్రవారం తెలిపారు. అయితే దేశ ప్రయోజనాల కోసమే మార్షల్ లా విధించారని యూన్ తరపు న్యాయవాదులు వాదించారు.
2024లో ఉత్తర కొరియా చెత్తతో నిండిన బెలూన్ లను ప్రయోగించిందని, అందుకు ప్రతిగా ఈ డ్రోన్ ఆపరేషన్ చేపట్టినట్లు వాదించారు. ఈ వాదనను కోర్టు తిరస్కరించింది. డ్రోన్ ఆపరేషన్ దక్షిణ కొరియా సైనిక సామర్థ్యాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకోవడాన్ని సూచిస్తుందని జడ్జీలు పేర్కొన్నారు. సాయుధ దళాల సర్వోన్నత అధికారం, మార్షల్ లా ప్రకటించే అధికారాలను అధ్యక్షుడు దేశ మనుగడ, భద్రత కోసం వినియోగించాలని స్పష్టం చేశారు. అయితే తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం అటువంటి అధికారాలను యూన్ ఏకపక్షంగా వినియోగిస్తూ ఉత్తర కొరియాపై డ్రోన్ ఆపరేషన్ కు అనుమతినిచ్చారని తెలిపారు. మార్షల్ లా ప్రకటించి తిరుగుబాటుకు యత్నించిన యూన్ కు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్షపై ఆయన అప్పీల్ చేయడంతో ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నారు.
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి 30 ఏండ్ల జైలు శిక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



