షూటింగ్‌లో భారత్‌కు నాలుగో పతకం…

నవతెలంగాణ – హాంగ్జౌ: ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల షూటింగ్‌ విభాగంలో నాలుగో పతకం దక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో ఐశ్వరి ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ కాంస్యం సాధించాడు. అంతకుముందు బంగారు పతకం గెలిచిన పురుషుల టీమ్‌లో కూడా ప్రతాప్‌ తోమర్‌ ఉన్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో తోమర్‌ 228.8 స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు. చైనా షూటర్‌ చెంగ్‌ లిహావో 253.3 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచి గోల్డ్‌ మెడల్‌ సాధించగా, కొరియా షూటర్‌ పార్క్‌ హజున్‌ 251.3 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచాడు. అంతకుముందు జరిగిన పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో రుద్రాంక్ష్‌ పాటిల్‌, దివ్యాన్ష్‌ సింగ్‌ పన్వర్‌, ఐశ్వరి తోమర్‌లతో కూడిన టీమ్ బంగారు పతకం గెలిచింది. అదేవిధంగా తొలిరోజైన ఆదివారం మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో రమిత, మొహులీ ఘోష్‌, ఆషి చౌక్సీతో కూడిన జట్టు రజత పతకం నెగ్గింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో రమిత జిందాల్‌ కాంస్య పతకం గెలుచుకుంది. దాంతో షూటింగ్‌లో పతకాల సంఖ్య నాలుగుకు, మొత్తం పతకాల సంఖ్య 9కి చేరింది.

Spread the love