– పల్లె పల్లెకు ఆర్టీసీ బస్సులు..
– ప్రతి నియోజకవర్గానికి 1000 ఉచిత కుట్టు మిషన్లు
– రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ – ఉప్పునుంతల
డిండి కట్ట మైసమ్మ ఆలయం అభివృద్ధికి రూ. 10 కోట్ల నిధులతో సమగ్ర ప్రణాళిక అమలు చేస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఉప్పునుంతల మండలంలోని ఆలయంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిటీ చైర్మన్ ఎడ్ల నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో సభ్యులు ప్రమాణం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ ప్రాంగణాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ బోటింగ్, రిసార్ట్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల సేవలను విస్తరించనున్నట్లు, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రతి నియోజకవర్గానికి వెయ్యి ఉచిత కుట్టు మిషన్లు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు భారీగా పాల్గొన్నారు.



