స్థానిక సౌండ్ బాక్సులనే వాడాలి
ముథోల్ సీఐ రవీందర్ నాయక్
నవతెలంగాణ – ముధోల్
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ముథోల్ సీఐ రవీందర్ నాయక్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముథోల్‌లోని జీఎం గార్డెన్స్‌లో శుక్రవారం నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. డీజే సౌండ్ కారణంగా గతంలో యువకుడు మృతి చెందిన ఘటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహారాష్ట్రకు చెందిన డీజే సౌండ్ సిస్టమ్స్‌కు అనుమతి లేదని సీఐ స్పష్టం చేశారు. వాటి అధిక శబ్దం వలన ఇబ్బందులు ఎదురవుతాయని, ఆరోగ్యానికి అధిక శబ్దం హానికరం అని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న స్థానిక సౌండ్ బాక్సులను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సౌండ్ బాక్సుల సమీపంలో చిన్న పిల్లలను తీసుకురావద్దని, తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వినాయక మండపాల నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గతంలో మండపాలు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లోనే ప్రస్తుతం కూడా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మండపాల నిర్వాహకులకు అందించిన గూగుల్ ఫామ్‌లో మండపానికి సంబంధించిన పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని అన్నారు. వినాయక ఉత్సవాల సందర్భంగా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే డీజే సౌండ్ సిస్టమ్స్‌పై నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తాయన్నారు. మండపాల నిర్వాహకులు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ముథోల్ ఎస్సై బిట్ల పెర్సిస్, ఎంపిడిఓ లవకూమార్ , ఆర్ఐ నారాయణరావు పటేల్, బీడీసీ అధ్యక్షుడు వరగంటి విట్టల్, కోరి సాయినాథ్, నాయకులు ఎజాజోద్దిన్ ,ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ పెద్దలు, మండపాల నిర్వాహకులు, యువకులు, నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.



