జీతాల్లేవ్‌

Get paid– 20 నెలలుగా ప్రభుత్వరంగసంస్థ హెచ్‌ఈసీ ఉద్యోగుల దుస్థితి
– పూట గడవటం కోసం కూలీ పనులకు వెళ్తున్న వైనం
– ఇస్రోకు పరికరాలను ఉత్పత్తి చేయటంలో వీరు కీలకం
– చంద్రయాన్‌-3 లాంచ్‌ప్యాడ్‌ నిర్మాణంలోనూ భాగం
– ప్రస్తుతం వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు
– మోడీ సర్కారు తీరుపై ఉద్యోగులు, కార్మికుల అసంతృప్తి
”చంద్రయాన్‌-3 విజయాన్ని దేశం మొత్తం సంబరాలు చేసుకుంటున్నది. అయితే దాని లాంచ్‌ ప్యాడ్‌ను తయారు చేయడానికి తమ రక్తాన్ని, చెమటను అందించిన ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల సంగతేంటి? హెచ్‌ఈసీ లాంచ్‌ ప్యాడ్‌ను అందించలేదని ఎవరైనా వాదిస్తే వారు అబద్ధం చెప్తున్నట్టే. మేము చంద్రయాన్‌-3 కోసం ఉపయోగించిన లాంచ్‌ ప్యాడ్‌ను తయారు చేశాం. కానీ ఇప్పటికీ మా జీతం కోసం ఎదురుచూస్తున్నాము” ఇది ప్రతిష్టాత్మకమైన ఓ ప్రభుత్వరంగసంస్థ ఉద్యోగుల ఆవేదన. శాస్త్ర,సాంకేతిక రంగాల్లో దేశాభివృద్ధికి పాటుపడుతున్న వీరి ఈ దుస్థితి దేనికి సూచిక..? ‘బలమైన ప్రధాని’ ‘బలమైన ప్రభుత్వం’ అని చెప్పుకుంటున్న వారు దీనికి ఏం సమాధానం చెపుతారు…?
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు అనేక పరికరాలను అందించిన హెవీ ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌(హెచ్‌ఈసీ)కి చెందిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్‌లతో సహా సుమారు 3,000 మంది ఉద్యోగుల జీవితాలు కఠినంగా మారాయి. 20 నెలలుగా వారికి వేతనాలు అందటం లేదు. ఇప్పుడు వారు పూట గడవటం కోసం తినుబండారాలు, వస్త్రాలు అమ్మటం, ఆటోరిక్షాలు నడపడంతో సహా ఇతర రోజువారీ వేతన కార్మికులుగా పనిచేయాల్సి వస్తున్నది. హెచ్‌ఈసీ అనేది అన్ని ప్రధాన ఉక్కు కర్మాగారాలకు పరికరాలను సరఫరా చేసే భారతదేశపు పురాతన ప్రభుత్వ రంగ యూనిట్‌. ఇది.. బొకారో, భిలారు, రూర్కెలా, విశాఖపట్నం, దుర్గాపూర్‌లోని ప్లాంట్‌లతో సహా భారతదేశం అంతటా అనేక ప్రధాన ఉక్కు కర్మాగారాల అభివద్ధికి దారితీసింది. హెచ్‌ఈసీ మూడు విభాగాలను కలిగి ఉన్నది. అవి.. హెవీ మెషిన్‌ టూల్స్‌ ప్లాంట్‌(హెచ్‌ఎంటీపీ), హెవీ మెషీన్స్‌ బిల్డింగ్‌ ప్లాంట్‌(హెచ్‌ఎంబీపీ), ఫౌండ్రీ ఫోర్జ్‌ ప్లాంట్‌(ఎఫ్‌ఎఫ్‌పీ). ఇవి సంయుక్తంగా పరికరాలను తయారు చేస్తాయి. అలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే తమ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీఎఫ్‌)లో ఎక్కువ భాగాన్ని విత్‌ డ్రా చేసుకున్నారు. కొందరు బయట అప్పులను కూడా చేశారు. చివరికి దినసరి కూలీలుగా మారి కుటుంబాలను పోషించుకుంటున్నారు.
పదేండ్ల క్రితం హెచ్‌ఈసీకి మోడీ
2013 డిసెంబర్‌లో ప్రధాని మోడీ అప్పటి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించడానికి రాంచీని సందర్శించారు. ఆ సమయంలో హెచ్‌ఈసీపరిస్థితిపై తన నిరాశను వ్యక్తం చేశాడు. కేంద్రంలో మోడీ సర్కారు వచ్చి పదేండ్లు గడుస్తున్నా.. హెచ్‌ఈసీ మూతపడే దశలో ఉన్నదని కొందరు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘కేంద్రం బాధ్యత వహించాలి’
”అత్యున్నత యాజమాన్యం నిజాయితీగా పని చేస్తే మా కార్మికులు వేతనాల సమస్యను ఎదుర్కొనేవారు కాదు. కేంద్రం దీనికి బాధ్యత వహించాలి. వీలైనంత త్వరగా డబ్బు విడుదల చేయాలి” అనిహెచ్‌ఈసీ వర్కర్స్‌ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి రామశంకర ప్రసాద్‌ ఆరోపించారు. హెచ్‌ఎంటీపీ ఇన్‌స్పెక్టర్‌ (క్వాలిటీ కంట్రోల్‌) కమలేష్‌ శర్మ మాట్లాడుతూ.. ”2010లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం హెచ్‌ఈసీని సందర్శించారు. భారత్‌కు అలాంటి సంస్థ అవసరమని నొక్కిచెప్పారు. అయితే, కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం మాత్రం గుడ్డిగా మారింది” అని చెప్పారు.
కుటుంబంతో మోమోస్‌ అమ్ముతూ..
మరొక హెచ్‌ఈసీ ఉద్యోగి అజరు మిర్ధా మోమోస్‌ లను అమ్ముతున్నాడు. అతని కుటుంబం మొత్తం ఈ చిరువ్యాపారంలో నిమగం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతను సాయంత్రం 5 గంటలకు ఆఫీసు నుంచి తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రం మోమోలు అమ్ముతాడు. ”మేము ఎప్పుడైనా మా గుర్తింపును దాచడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే నేను భారతదేశపు పురాతన ప్రభుత్వ రంగ సంస్థలో పని చేస్తున్నాను. ఇప్పటికీ మోమోలను విక్రయించవలసి వస్తుంది అని ప్రజలకు తెలిస్తే అది చాలా అవమానకరం. భారత ప్రభుత్వం మా బాధను అర్థం చేసుకుని మా జీతాలను విడుదల చేస్తుందని నేను ఇప్పటికీ ఆశిస్తున్నాను” అని మిర్ధా చెప్పటం గమనార్హం.
దుస్తులు విక్రయిస్తూ..
1993 నుంచి హెచ్‌ఈసీలో పనిచేస్తున్న దేవేంద్ర కుమార్‌.. పాత విధానసభ సమీపంలోని షాలిమార్‌ బజార్‌లో గంచా (టవల్స్‌), లేడీస్‌ గార్మెంట్స్‌తో సహా రెడీమేడ్‌ దుస్తులను విక్రయించవల్సి వస్తున్నది. ఇప్పటికీ హెచ్‌ఎంబీపీలో పనిచేస్తున్న కుమార్‌ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యాలయానికి హాజరవుతాడు. ఆ తర్వాత అతను బట్టల సేల్స్‌మెన్‌గా పని చేస్తాడు. కుమార్‌ రోడ్డు ప్రక్కన ఒక తాత్కాలిక దుకాణాన్ని నడుపుతున్నాడు. బీహార్‌లోని నలంద జిల్లాకు చెందిన ఈ కుమార్‌ మాట్లాడుతూ.. ”సాధారణ జీతం లేకుండా జీవించడం చాలా కష్టం. రాంచీలో డిగ్రీ కోర్సులు చదువుతున్న నా ముగ్గురు పిల్లల చదువుకు నేను తోడ్పాటు అందించలేకపోతున్నాను. నా పెద్ద కొడుకు మెడిసిన్‌ చదవాలనుకున్నాడు. కానీ అతని అడ్మిషన్‌ కోసం మా దగ్గర డబ్బు లేదు. మేము ఆర్థికంగా చితికిపోవటంతో ఎవరూ మాకు డబ్బు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది” అని అన్నారు.
కూలీగా అశోక్‌ రామ్‌
హెచ్‌ఈసీకి చెందిన మరో ఉద్యోగి అశోక్‌ రామ్‌.. ధ్రువ ప్రాంతంలో రోజువారీ కూలీగా మారాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. రామ్‌, అతని భార్య యశోదా దేవి రోజువారీ కూలీలుగా పని చేస్తూ రోజుకు రూ.450 సంపాదిస్తున్నారు. ”నా పిల్లలు ఒక ప్రయివేటు స్కూల్‌లో చదివేవారు. నేను వారి ఫీజులను భరించలేక వారిని జగన్నాథ్‌పూర్‌ రాజ్‌కీయ మాధ్యమిక పాఠశాలకు మార్చవలసి వచ్చింది”అని అశోక్‌ రామ్‌ చెప్పారు.
ఆటో డ్రైవర్‌గా ఉమేశ్‌ నాయక్‌
ఉమేష్‌ నాయక్‌ అనే మరో ఉద్యోగి ఆటోరిక్షా డ్రైవర్‌గా పార్ట్‌టైమ్‌ పనిచేస్తున్నాడు. ” నా కుటుంబాన్ని పోషించుకోవటానికి సాయంత్రం 5 గంటల తర్వాత నేను ఆటో నడుపుతాను. ఒక నెలలో, నేను రూ. 10,000 నుండి రూ. 12,000 వరకు సంపాదించగలను. ఇలా నేనొక్కడినే కాదు.. వారి కుటుంబాలను పోషించుకోవటానికి పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాల్లో ఉన్న అనేక మంది హెచ్‌ఈసీ ఉద్యోగులు ఉన్నారు. కొందరు కూరగాయలు విక్రయిస్తుంటారు. మరికొందరు వీధి పక్కన చిరుతిండి, ఇతర తినుబండారాలను కూడా అమ్ముతున్నారు. చాలా రోజుల నుంచి మాకు జీతం రాకపోవడంతో మాకు ఓపిక నశిస్తున్నది” అని నాయక్‌ చెప్పారు.

Spread the love