Monday, August 24, 2026
E-PAPER
Homeఖమ్మంకార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలకు సిద్ధంకండి

కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలకు సిద్ధంకండి

- Advertisement -

– ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్
– ముగిసిన ఏఐటీయూసీ జిల్లా 17వ మహాసభలు
నవతెలంగాణ – సత్తుపల్లి

సత్తుపల్లిలోని సిద్ధారం రోడ్డు లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్‌ లో ఆదివారం ప్రారంభమైన ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా 17వ మహాసభలు సోమవారంతో ముగిశాయి. సంఘ నాయకులు నిమ్మటూరి రామకృష్ణ, సీహెచ్ సీతామహాలక్ష్మి, శివరామకృష్ణ, మోహన్ రావు ల అధ్యక్షతన జరిగిన ముగింపు సభకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ​కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, బ్రిటిష్ కాలం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చి కార్మిక హక్కులను హరించే ప్రయత్నం చేస్తోందని యూసుఫ్ విమర్శించారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ, ప్రజా ఉద్యమకారులు,  మేధావులపై వివిధ ముద్రలు వేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

కార్మిక చట్టాల ఉల్లంఘన వల్ల కార్మికుల అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడిందని, హక్కుల పరిరక్షణ కోసం కార్మిక వర్గమంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం. నరసింహ మాట్లాడుతూ… కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల శ్రమను దోచుకునే విధానాలను ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. కనీస వేతన చట్టం అమలు కాకపోవడంతో ప్రస్తుత వేతనాలతో జీవించడం కష్టంగా మారిందని, కార్మిక యూనియన్లను నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొట్టేందుకు రానున్న రోజుల్లో పెద్దఎత్తున పోరాటాలు చేపడతామన్నారు. తెలంగాణ రైతు సంఘం నాయకుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ… రైతులు, కార్మికులు ఐక్యంగా పోరాడటం వల్లే కేంద్రం మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుందని, అదే స్ఫూర్తితో యువత, విద్యార్థులు కూడా తమ సమస్యలపై నిలదీయాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ… సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏఐటీయూసీ కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేసిందని, కార్మికులకు ఎల్లప్పుడూ ఎర్రజెండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పంచాయతీ, మున్సిపల్, ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, పారిశుధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు, పని గంటల తగ్గింపునకు ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ​ఈ మహాసభలో సీపీఐ, ఏఐటీయూసీ, వివిధ ప్రజా సంఘాల నాయకులు జమ్ముల జితేందర్ రెడ్డి, సింగు నర్సింహారావు, తోట రామాంజనేయులు, బీజీ క్లైమెంట్, ఎర్రబాబు, వేము రాంబాబు, రామ్మూర్తి నాయక్, తాటి వెంకటేశ్వరరావు, దండు ఆదినారాయణ, పోటు కళావతి, తడికమళ్ల యోబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -