అనారోగ్యంతో బాలిక మృతి

– డెంగ్యూ జ్వరం గా అనుమానం..
– నిర్ధారణ కాలేదు అంటున్న ప్రభుత్వ వైద్యుడు..
నవతెలంగాణ – అశ్వారావుపేట: ఏజన్సీ లో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అభం శుభం తెలియని అమాయక గిరిజనులు ఏ జ్వరం మో తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మండలంలోని నందిపాడు కు చెందిన ఊకే చిన ముక్తేశ్వర రావు – శ్రీ లక్ష్మి ల 10 ఏండ్లు బాలిక శాన్వి(10) జ్వరానికి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. పాప తల్లిదండ్రులు తెలిపిన సమాచారం మేరకు సెప్టెంబర్ 30 న శాన్వి కి జ్వరం వచ్చింది. అక్టోబర్ 2 వ తేది సోమవారం వినాయకపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. డాక్టర్ రాందాస్ రక్త నమూనా సేకరించి మలేరియా నిర్ధారణ పరీక్ష చేయించారు. మలేరియా నిర్ధారణ కాకపోవడంతో తరుణ వ్యాధిగా గుర్తించి చికి ప్రాధమిక చికిత్సగా జ్వరం తగ్గడానికి మందులు ఇచ్చి పంపారు. ఇంటికి వచ్చిన వీరు పాపకు ఎంతకీ జ్వరం తగ్గు ముఖం పట్టక పోవడంతో శాన్వి అమ్మమ్మ స్వగ్రామం ఆంద్రప్రదేశ్, ఏలూరు జిల్లా,రాచన్నగూడెం తీసుకెళ్ళి స్థానిక వైద్యుడి చేత చికిత్స చేయించారు. అక్కడా తగ్గక పోవడంతో స్థానిక వైద్యుడు జంగారెడ్డి గూడెం ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేసాడు.అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు డెంగ్యూ గా అనుమానం ఉందని వైద్యం చేసారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి శాన్వి మృతి చెందింది. డెంగ్యూ కాదు – ఏదో వైరల్ జ్వరం అయి ఉంటుంది – డాక్టర్ రాందాస్ శాన్వి మృతి సంఘటన పై వినాయకపురం ప్రభుత్వ వైద్యుడిని వివరణ కోరగా మా ఆసుపత్రిలో మలేరియా నిర్ధారణ కాలేదని, అయినా మళ్ళీ ఆ పాపను మా ఆసుపత్రికి తీసుకురాలేదు అని, బయట ఎక్కడో ఎవరో వైద్యం చేస్తే అది డెంగ్యూ నా లేక మరేదైనా వైరల్ జ్వరం మో నాకు ఎలా తెలుస్తుంది అని అన్నారు. ఏ ఆసుపత్రిలో అయినా “ఎలీషా పరీక్ష” ద్వారా నిర్ధారణ అయితేనే డెంగ్యూ అని గుర్తించి వైద్యం చేస్తారని తెలిపారు. మా శాఖ పరంగా కూడా విచారణ చేపడుతున్నాం అని ప్రకటించారు.
Spread the love