మేకపోతు గాంభీర్యం

మేకపోతు గాంభీర్యం– పరాజయం ఎక్కడంటూ వితండవాదం
– యూపీ ఎదురు దెబ్బల ప్రస్తావనే లేదు
– ఎన్డీఏ భేటీలో కాంగ్రెస్‌పై మోడీ వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో 240 స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ… మెజారిటీకి ఆమడ దూరంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ప్రధాని మోడీ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. పాత పార్లమెంట్‌ భవనంలోని సెంట్రల్‌ హాలులో ఎన్డీఏ నేతలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగాన్ని గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. గతంలో తాము ఎన్నడూ ఓడిపోలేదని, ఇప్పుడు కూడా పరాజయం చెందలేదని ఆయన చెప్పుకొచ్చారు.
‘మేము ఓటమి పాలయ్యామంటూ గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. బహుశా కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఆయా పార్టీలు ఇలా చెబుతూ ఉండవచ్చు. ఇలాంటి కల్పిత కథలు అల్లడం వారికి అవసరం. గణాంకాలను బట్టి చూస్తే చరిత్రలో ఇప్పుడు ఏర్పడబోయేది బలమైన కూటమి ప్రభుత్వం. ఓటమి వెనుక విజయాన్ని కప్పిపుచ్చేందుకు వారు ప్రయత్నించారు. కానీ మేము గతంలో ఎన్నడూ ఓడిపోలేదని, ఇప్పుడు కూడా ఓటమి చెందలేదని ప్రజలకు తెలుసు’ అని ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు సంధించారు.
బీజేపీ కాదు… ఎన్డీఏ ప్రభుత్వం
ప్రధాని వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి తెలుగుదేశం, జేడీయూ పార్టీల మద్దతు తప్పనిసరి అని ఫలితాలు చెబుతున్నాయి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జేడీయూ అధిపతి నితీష్‌ కుమార్‌ మోడీ పక్కనే కూర్చోవడం పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. వాస్తవానికి బీజేపీ ఎన్నికల ప్రచారం యావత్తూ మోడీ చుట్టూనే సాగింది. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోకు కూడా ‘మోడీ కీ గ్యారంటీ’ అని పేరు పెట్టారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ బీజేపీకి లభించక పోవడంతో రాబోయేది ‘మోడీ ప్రభుత్వం’ కాదని, ‘ఎన్డీఏ ప్రభుత్వ’మని స్పష్టమైపోయింది.
రామ జపం కాదు… జగన్నాథ జపం
కాగా ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బలపై ఎన్డీఏ సమావేశంలో మోడీ కనీసం ప్రస్తావించనైనా లేదు. కాంగ్రెస్‌పై మాత్రం ఎప్పటి మాదిరిగానే నిప్పులు చెరిగారు. పది సంవత్సరాల తర్వాత కూడా ఆ పార్టీ సెంచరీ కొట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లను కలిపినా కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ సాధించిన స్థానాల సంఖ్యను చేరుకోలేదని గుర్తు చేశారు. ఇండియా బ్లాక్‌ను అత్యంత వేగంగా మునిగిపోతున్న నావగా అభివర్ణించారు. విజయం సాధించిన తర్వాత చేసిన ప్రసంగంలో కూడా ఉత్తరప్రదేశ్‌లో ఎదురైన పరాజయాలను మోడీ గుర్తు చేసుకోలేదు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఎన్నికల ప్రచారాంశంగా ఉపయోగించుకొని, తీరా విజయోత్సవ సందేశంలో జగన్నాథస్వామిని ప్రస్తుతించారు. జగన్నాథ స్వామి దేవాలయం ఉన్న పూరీ క్షేత్రం ఒడిశాలో ఉంది. ఆ రాష్ట్రంలో ఎన్డీఏకు మంచి ఫలితాలు లభించిన విషయం తెలిసిందే. దానిని దృష్టిలో పెట్టుకొనే మోడీ జగన్నాథ స్మరణ చేశారు. కాగా తమిళనాడులో పార్టీకి ఒక్క సీటు రాకపోయినా అక్కడి కార్యకర్తలను మోడీ ప్రశంసించారు.
వేదికను పంచుకోని ఆర్‌ఎల్‌డీ
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి తీవ్ర ఆశాభంగం కలిగించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన ఆ రాష్ట్రంలో బీజేపీకి వచ్చింది 33 స్థానాలే. భాగస్వామ్య పక్షమైన ఆర్‌ఎల్‌డీతో కలిపి ఎన్డీఏకు వచ్చింది 36 సీట్లు. ఇండియా బ్లాక్‌ 43 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. అందులో ఒక్క సమాజ్‌వాదీ పార్టీకే 37 సీట్లు రాగా కాంగ్రెస్‌కు ఆరు స్థానాలు లభించాయి. కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మిత్రపక్షాలన్నీ కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఆర్‌ఎల్‌డీ అధినేత జయంత్‌ చౌదరి సహచర నేతలతో కాకుండా సమావేశంలో నూతన ఎంపీలతో కలిసి కూర్చోవడం ఆసక్తిని కలిగించింది. మరో మిత్రపక్షమైన అప్నాదళ్‌ (సోనేలాల్‌) ఒకే ఒక స్థానాన్ని గెలుచుకున్నప్పటికీ ఆ పార్టీ నేత అనుప్రియ పటేల్‌ వేదికపై కూర్చున్నారు. గతంలో ఇండియా బ్లాక్‌లో ఉన్న చౌదరి ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ఎన్డీఏ పంచన చేరారు.

Spread the love